ఇందూరు, అక్టోబర్ 27 : ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం ఈ నెల 31న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. వీరికి ఏర్పాట్లు చేసే విషయమై వివిధ శాఖల అధికారులతో గురువారం సెల్కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ట్రైనీ అధికారుల బృందం శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు జిల్లాకు రానున్నట్లు చెప్పారు. ధర్పల్లి మండలం దుబ్బాక, కోటగిరి మండలం ఎత్తొండ, ఆలూర్ మండలం మిర్దాపల్లి, జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్, కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామాల్లో ఈనెల 31 నుంచి నవంబర్ 5 వ తేదీ వరకు బస చేసి పలు అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తారని వివరించారు.
ట్రైనీ అధికారులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించారు. దళితబంధు, పల్లెప్రగతి పథకాలతోపాటు వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంఘాల పనితీరు తదితర అంశాలను ఈ బృందాలు పరిశీలిస్తారని, అవసరమైన సమాచారం రూపొందించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సెల్కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, ఏసీపీలు, ఆర్డీవోలు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.