నిజామాబాద్, అక్టోబర్ 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కారు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో వైద్యులు సమష్టిగా కృషి చేసి సామాన్య జనానికి మేలు చేస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో రూ.లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లను ఉచితంగా నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు నేతృత్వంలో ప్రభుత్వ వైద్యశాలలు కొంత కాలంగా కొంగొత్తగా పరుగులు తీస్తున్నాయి. ఇందులో భాగంగా సేవల్లో మెరుగుదల కనిపిస్తోంది. విప్లవాత్మకమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యం దవాఖానల వారీగా సమీక్షలు, సమావేశాల మూలంగా కొద్ది రోజుల్లోనే గణనీయమైన మార్పు అన్నది స్పష్టంగా వెలుగు చూస్తున్నది. తద్వారా పేద ప్రజలందరికీ ఉచితంగా సర్కారు దవాఖానలో అత్యుత్తమమైన వైద్యం అందుతున్నది. ప్రసవాల దగ్గరి నుంచి మొదలు పెడితే మోకీలు మార్పిడి వరకు పైసా ఖర్చు లేకుండా సర్కారు వైద్యులే అన్నీ తామై చూసుకుంటున్నారు. వివిధ డిపార్ట్మెంట్ల పరిధిలోని నిష్ణాతులైన వైద్యుల బృందం సమష్టిగా పని చేస్తూ నిజామాబాద్ జీజీహెచ్ పేరును రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెడుతున్నారు. ఇందుకు మోకీలు ఆపరేషన్లతో పాటుగా తాజాగా ఒకే రోజు 87 శస్త్ర చికిత్సలు జరగడం విశేషం.
ఒకే రోజు 87 శస్త్ర చికిత్సలు…
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో ఒకే రోజు 87 ఆపరేషన్లు జరిగాయి. ఒక్క రోజులో మోకీలు మార్పిడి ఆపరేషన్లతో వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు మెప్పును పొందిన కొద్ది సమయంలోనే మరో ఘనతను ఇక్కడి వైద్య బృందం దక్కించుకున్నది. గతంలో నిర్వహించిన అత్యధిక ఆపరేషన్ల రికార్డును జీజీహెచ్ తిరగరాసింది. కొద్ది రోజుల క్రితమే జీజీహెచ్‌లో 59 ఆపరేషన్లు ఒకే రోజు జరగడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఇప్పుడు అంతకు మించి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో నిర్వహించిన ఆపరేషన్లు 17 ఉండగా 15 మందికి ప్రసవాలు, ఎముకల విభాగంలో మరో రెండు కేసులున్నాయి. సహజ ప్రసవాలకు ప్రయత్నించి చివరి నిమిషంలో మరో నలుగురు గర్భిణులకు ఆపరేషన్లు చేశారు. ప్రసవాల సంఖ్య 19 వరకు ఉన్నాయి. ఆర్థో విభాగంలో జరిగిన మొత్తం 5 ఆపరేషన్లు ఒకే రోజు నిర్వహించగా ఇందులో 2 ఆరోగ్య శ్రీ కింద నిర్వహించారు. ఈఎన్టీ(కన్ను, చెవి, గొంతు) విభాగం పరిధిలో 2 ఆపరేషన్లు జరిగాయని జీజీహెచ్ అధికారులు తెలిపారు.
మోకీలు చికిత్సలో జోరు…
వయసు మీద పడుతున్న సమయం లో వృద్ధులకు మోకీలు సమస్యలు ఎక్కువగా వస్తాయి. మోకీలు మార్పిడికి ప్రయత్నిస్తే ప్రైవేటులో రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమీ చేయలేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా మోకీలు మార్పిడికి చర్యలు చేపట్టడంతో చాలా మందికి ఉపశమనం దక్కింది. సరిగ్గా మూడున్నర నెలల కాలంలోనే 60కి పైగా మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను జీజీహెచ్ ఎముకల విభాగం వైద్యులు నిర్వహించారు. పైసా ఖర్చు లేకుండానే సామాన్యులకు మేలు చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఏకంగా ఒకే రోజు 10 మందికి బాధితులకు మోకీలు మార్పిడి నిర్వహించడం ద్వారా జీజీహెచ్‌కు గుర్తింపు దక్కింది. మోకీలు మార్పిడిపై గ్రామాల్లో పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహిస్తున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారిని గుర్తించి వారికి సరైన వైద్యం అందించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ ఉచిత శస్త్ర చికిత్సలకు ప్రోత్సహిస్తున్నారు.
అమ్మతనానికి ఆయువు…
ఇక ప్రసవాల్లోనూ జీజీహెచ్ దూసుకుపోతున్నది. మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖానల్లో నిజామాబాద్ జీజీహెచ్ పెద్ద ఎత్తున శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నది. కొవిడ్-19 సమయంలోనూ వైరస్ సోకిన గర్భిణులకు ప్రత్యేక చొరవతో ప్రసవాలు నిర్వహించి జీజీహెచ్ అండగా నిలిచింది. ఆ సమయంలో జీజీహెచ్ సేవలను మెచ్చిన మహారాష్ట్ర వాసులు కూడా క్యూ కట్టారు. ప్రైవేటులో కరోనా సోకిన గర్భిణులను చేర్చుకోవడానికి ముందుకు రాకపోయినప్పటికీ జీజీహెచ్ వైద్యులు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లీబిడ్డలను ప్రత్యేక సంరక్షణలో కొవిడ్ వైరస్ నుంచి బయట పడేయడంలోనూ జీజీహెచ్ చేసిన కృషి అంతా ఇంతా కాదు.
నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుండగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో సహజ కాన్పులకు జీజీహెచ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో 80 నుంచి 90 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతుండగా మిగిలిన కేసుల్లో పరిస్థితి అదుపులో లేనప్పుడు తల్లీ బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా ఆపరేషన్లు చేస్తున్నారు. మొత్తానికి జీజీహెచ్‌లో అన్ని విభాగాల్లోనూ పెరిగిన వైద్య సేవలతో సామాన్యులకు భారీ ఉపశమనం దక్కుతున్నది.
టీమ్ వర్క్‌కు నిదర్శనం…
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలతోనే జీజీహెచ్‌లో రికార్డు స్థాయిలో ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పేద ప్రజలకు మేలు జరిగే విధంగా వైద్య సేవలను వారికి అందిస్తున్నాం. ఒకే రోజు పది మందికి మోకీలు మార్పిడి చేయడంతో పాటు ఒక్క రోజులోనే 87 మందికి శస్త్ర చికిత్సలు చేయడం కూడా సమష్టి కృషి ఫలితమే. జీజీహెచ్‌లో గతంలో ఒకే రోజు 59 ఆపరేషన్లు జరిగాయి. రాబోయే రోజుల్లో ఒకే రోజు వందకు పైగా ఆపరేషన్లు చేసే స్థాయికి చేరుకుంటాం.
– ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్