నస్రుల్లాబాద్(బీర్కూర్)/ కోటగిరి/వర్ని, అక్టోబర్ 21: ప్రతి నిరుపేద కుటుంబానికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బీర్కూర్, కోటగిరి, వర్ని మండలాల్లో పర్యటించారు.బీర్కూర్ మండలం కేంద్రంలో బీర్కూర్, బీర్కూర్ తండా, బైరాపూర్, తిమ్మాపూర్, బరంగేడ్గి, మల్లాపూర్, చించెల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మంజూరైన బిల్లులను(రూ.5 కోట్ల 92వేలు) అందజేశారు. కోటగిరి మం డలం దేవునిగుట్ట తండాలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, అంగన్వాడీ భవనం ప్రహరీని ప్రారంభించారు.అనంతరం దేవునిగుట్ట తండా, వర్నిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను అందజేశారు. అంతకుముందు కొత్తపల్లిలో రూ. 10లక్షలతో చేపట్టనున్న ముదిరాజ్ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బీర్కూర్, దేవునిగుట్ట తండా, వర్నిలో ఏర్పాటు చేసిన సభల్లో స్పీకర్ మాట్లాడుతూ.. పేదలు సొంతింటిలో నివసిస్తే వారికి ఎంత సంతృప్తి ఉంటుందో, వారి కండ్లలో సంతోషం చూసి తనకు అంతకన్నా ఎక్కువగా ఆనందం కలుగుతుందన్నారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం రానున్నదని, అర్హులైన వారందరికీ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే 10 వేల ఇండ్లు మంజూరు కాగా వాటి నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయని తెలిపారు.
అనర్హులకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులను జైలుకే పంపిస్తామని హెచ్చరించారు. బాన్సువాడ నియోజకర్గానికి రూ.120 కోట్లు అవసరం ఉండగా ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మిగతా రూ.70 కోట్లు కూడా వస్తాయని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో మన రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని, ఇందుకు ఇటీవల కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన పలు అవార్డులే నిదర్శనమన్నా రు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు. బీర్కూర్ కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, దేవునిగుట్ట తండాలో కార్యక్రమంలో ఎంపీపీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్‌పటేల్, వైస్‌ఎంపీపీ గంగాధర్‌పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, సర్పంచులు శాంతాబాయి, భారతి, వర్నిలో జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, రైతుబంధు సమితి వర్ని, మోస్రా మండల కన్వీనర్లు సింగంపల్లి గంగారాం, పిట్ల శ్రీరాములు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు.
నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట దళారులకు విక్రయించి నష్టపోకుండా ఉండేందుకు శనివారం నుంచి అన్ని సహకార సంఘాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చాలా చోట్ల దళారులు వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని తెలిపారు. వెంటనే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2060, ‘బీ’ గ్రేడ్ రకానికి రూ.2040 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు వస్తున్న ఇతర రాష్ర్టాల వ్యాపారులను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామన్నారు.