నిజామాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి జిల్లా ప్రజలు తొలి నుంచీ బ్రహ్మరథం పట్టారు. ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి నడిచారు. కష్టకాలంలోనూ గులాబీ దళపతికి నైతికంగా, రాజకీయంగా మద్దతు పలికారు. ఫలితంగా చంద్రశేఖరుడి పోరాట సారథ్యంలో దశబ్దాల కల నెరవేరింది. స్వరాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ తన దార్శనికతతో తెలంగాణను దేశానికి దిక్సూచిగా మార్చారు. అభివృద్ధి, సంక్షేమంలో రోల్‌మోడల్‌గా నిలిపారు. అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగి పోయాయి. రాష్ర్టాలపై పెత్తనం చేస్తూ, ఆంక్షలు విధిస్తూ మోదీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తున్నది. ఈ తరుణంలో జాతిని జాగృతం చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందింది. కలుషితమైన జాతీయ రాజకీయాలను పారదోలేందుకు బయల్దేరిన కేసీఆర్‌కు దండిగా మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నది. రైతులు, మహిళలు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తూ గులాబీ దళపతికి బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సామాన్య జనమంతా కలిసికట్టుగా నాటి ఉద్యమ సారథి, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నైతిక మద్దతును ప్రకటిస్తున్నారు. అక్టోబర్ 5న చేసిన ప్రకటనకు ఇప్పటికే వివిధ రూపాల్లో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రజలంతా ఇప్పుడు కొత్తగా విరాళాల రూపంలోనూ జై కొడుతున్నారు. కేసీఆర్ వెంట మేమున్నామంటూ నినదిస్తూ స్వచ్ఛందంగా మద్దతును తెలియజేస్తున్నారు. కొంత కాలంగా బా ల్కొండ నియోజకవర్గంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నేపథ్యం లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక పాత్రను పోషించాలని ఆశిస్తున్నారు.‘మేమంతా మీ వెంటే అంటూ’ నినదిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైతం ఉన్నారు. తమకొచ్చే కొద్దిపాటి సొమ్ము నుంచి కేసీఆర్‌పై ఉన్న ప్రేమతో తమకు తోచినంత విరాళం రూపంలో అందిస్తూ అభిమానం చాటుతున్నారు. బాల్కొండలో మొదలైన ప్రజా నిర్ణయం ఉమ్మడి జిల్లాలోని మిగిలిన వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నది.
వెల్లువెత్తిన అభిమానం..
బాల్కొండ నియోజకవర్గమంటే ఆది నుంచి టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తున్నది. 2014 నుంచి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ ప్రాంతం కంచుకోటగా ఉంది. సమైక్యాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన బాల్కొండ నేడు సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్నది. సాగు, తాగు నీటితో పాటుగా మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు కూత వేటు దూరంలోని బాల్కొండ నియోజకవర్గంలో గల అనేక పల్లెలకు గతంలో సాగు నీటి కటకట ఉండేది. కేసీఆర్ పరిపాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి నాంది పలికి నీటి గోసను తీర్చారు. అంతేకాకుండా అనేక చిన్నపాటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పునర్జీవం కల్పించడం ద్వారా వేలాది భూములు నేడు సస్యశ్యామలం అవుతున్నాయి. గతంలో వానకాలంలోనూ పడావుగా కనిపించిన పల్లెలు నేడు పచ్చని పంటపొలాలతో దర్శనమిస్తున్నాయి. రైతులు, సబ్బండ వర్గాల ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారు. కృతజ్ఞతను చాటిచెప్పేందుకు బాల్కొండ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసీఆర్‌కు జై కొడుతున్నారు. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు నేపథ్యంలో మద్దతును ప్రకటిస్తున్నారు.
నాడు మోతె…
రాష్ట్ర సాధనలో కేసీఆర్‌కు దక్కిన మద్దతులో నిజామాబా ద్ జిల్లాను మరువలేము. అందులో బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం మోతె గ్రామం ప్రత్యేకమైనది.రాష్ర్టాన్ని సాధించాలన్న సంకల్పంతో ఈ ప్రాంత ప్రజలు చూపిన చొరవ అంతాఇంతా కాదు. ఈ గ్రామ స్తులంతా ఐక్యంగా తీసుకున్న నిర్ణయానికి ముగ్ధులైన గులాబీ సారథి స్వయంగా మోతెకు వచ్చి ఇక్కడి మట్టిని ముడుపు కట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడికి వచ్చి ముడుపును విప్పారు. ఇప్పుడు ఇదే ప్రాంతానికి చెందిన ప్రజలు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రకటనపై స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్ వెంట నిలుస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. మోతె బాటలోనే ఇప్పు డు బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజలు నడుస్తుండ డంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కేసీఆర్ జాతీయ రా జకీయాల్లో వస్తే తెలంగాణ మాదిరిగానే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సామాన్య జనమంతా అభిలాషిస్తున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా రు. స్వచ్ఛంద విరాళాల అంశం ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మిగిలిన నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నది.
రైతులకు అన్ని విధాలా న్యాయం..
వేల్పూర్, అక్టోబర్ 18 : మాకు రెండు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్, రైతు బంధు, పండించిన పంటకు సీఎం కేసీఆర్ మద్దతు ధరను అంది స్తున్నారు. అందుకే కేసీఆర్ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి నావంతుగా రూ.2 వేలు విరాళం అందజేయడం సంతోషంగా ఉంది.
–భూమన్న, వేల్పూర్
దేశాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదప్రజలను కేసీఆర్ ఆదుకుంటున్నారు. మా లాంటి వాళ్లకు నెలకు రూ. 2వేల పెన్షన్ ఇస్తూ అండగా నిలుస్తున్నాడు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి నెల పింఛన్ విరాళంగా ఇచ్చాను.
–కొత్తూర్ అంజయ్య, పచ్చలనడ్కుడ
రైతుబీమా లాంటి పథకాలు దేశం మొత్తం అవసరం
బాల్కొండ, అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ద్వారా నేను లబ్ధి పొందాను. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందిన వారందరూ కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ రాణించాలని కోరుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి నా వంతుగా ఐదు వేల రూపాయల విరాళం అందించాను. తెలంగాణ పథకాలు దేశమంతటా విస్తరించాలని కోరుకుంటున్నాను.
–సతీశ్, రైతు, బాల్కొండ
అప్పు లేకుండా బిడ్డ పెండ్లి చేశా
నా కూతురుకు పెండ్లి చేసిన. కేసీఆర్ సార్ రూ.లక్షా 116 అందజేసిండు. దీంతో అప్పు లేకుండా పెండ్లి చేసి పంపించిన. నా భార్యకు నెలనెలా బీడీల పింఛన్ వస్తున్నది. కేసీఆర్ దేశ్ కీ నేత కావాలని బీఆర్ఎస్ పార్టీకి నా వంతు సహాయం చేస్తున్నా.
–ముజీబ్, బాల్కొండ
స్వచ్ఛందంగా విరాళాలు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారు కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి తమ వంతు సహాయంగా రూ.93,600లు అందజేశారు. ఇలాంటి పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవు. ఇలాంటి పథకాలు అంతటా అమలు కావాలని.. అందుకు సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత కావాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు.
–బద్ద ప్రవీణ్‌రెడ్డి, బాల్కొండ