ఖలీల్‌వాడీ(మోపాల్), అక్టోబర్ 18 : రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మోపాల్ మండలం కంజ ర గ్రామంలో ఆదర్శ రైతు ఎండీ.తమీమ్ సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తి గా సేంద్రియ పద్ధతులను అవలంబిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరమున్నర విస్తీర్ణంలో పండిస్తున్న పంటను ఆసక్తిగా పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పండించడంలో పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, మెళకువలను రైతు తమీమ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఈ పంట పండించేందుకు సుమారు రూ. ఐదు నుంచి రూ. ఆరు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుందని తమీమ్ కలెక్టర్‌కు తెలిపాడు. ఎకరాకు 10 టన్ను ల వరకు దిగుబడి వస్తుందని, కనీసం రూ.10 లక్షల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. ఇప్పటికే రిటైల్‌గా కిలోకు రూ.200 చొప్పున మూడు టన్నుల పంట విక్రయించానని చెప్పగా, తమీమ్‌ను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు మూస ధోరణిని వీడి, మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పంటలను సాగు చేయాలని సూచించారు. ముఖ్యంగా యువరైతులు వినూత్న పద్ధతుల్లో ప్రయోగాత్మక పంటల సాగుకు ముందుకు రావాలని కోరారు. సాంప్రదాయంగా వస్తున్న వరి పంట సాగు చేస్తే ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకే ఆదాయం లభిస్తుందన్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టేందుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా ఎకరానికి మూడు విడుతల్లో 96 వేల రూపాయల సబ్సిడీని అందిస్తోందని వివరించారు. డ్రాగన్ ఫ్రూట్ అనే కాకుండా ఇదే తరహాలో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకుంటే రైతులు అధిక లాభాలు, సాగుతో స్థానిక అవసరాలు కూడా తీరుతాయన్నారు. అధునాతన పద్ధతుల్లో వినూత్న పంటల సాగుకు ముందుకొచ్చే రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తారన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌దాస్ తదితరులున్నారు.