మెండోరా, అక్టోబర్ 16: ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 87,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 22 వరదగేట్ల నుంచి గోదావరిలోకి 68,640 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి నాలుగు వేలు, కాకతీయ కాలువకు 4,000, వరదకాలువకు 10 వేలు, లక్ష్మీ కాలువకు 200, సరస్వతీ కాలువకు 100 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని వివరించారు. ఈ సీజన్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 501 టీఎంసీల వరద వచ్చి చేరిందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి నిండుకుండలా ఉందని ఏఈఈ తెలిపారు.
నిజాంసాగర్, అక్టోబర్ 16: ఎగువప్రాంతం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 36,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో ప్రాజెక్టు ఏడు వరద గేట్ల నుంచి 43,400 క్యూసెక్కులు మంజీరలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హెడ్రెగ్యులేటర్ ద్వారా మరో 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం (1405.00 అడుగులు) 14.80 టీఎంసీలతో ఉన్నట్లు తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టు వద్దే గడిపారు.
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 16 : మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఎగువ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టులోకి 3,230 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.