కోటగిరి, అక్టోబర్ 16: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల తరహాలో ఆయా పాఠ్యాంశాలపై ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థుల చదువు సామర్థ్యాలకు మరింత పదును పెట్టాలని భావిస్తోంది. ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలని ఈమేరకు బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు మొదటి నుంచి ఎంసెట్, నీట్లో ప్రవేశానికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. దీంతో వారికే మెరుగైన ర్యాంకులు వస్తుంటాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు నష్టపోతుండేవారు. ఇకపై ప్రభుత్వ కళాశాలల్లో సైతం ఎంసెట్, నీట్లో ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని 28 మండలాల పరిధిలో మొత్తం 15 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలో 8,324 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో అధిక శాతం పేద విద్యార్థులే ఉండడంతో ఎక్కువ మంది వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ చదువుకుంటున్నారు. దీంతో చదువుపై ఎక్కువ దృష్టి సారించకపోవడంతో వార్షిక పరీక్షల ఫలితాలు నిరాశాజనకంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యం లో ప్రభుత్వం ప్రతివారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యేక తరగతులతో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన నూతన విధానం పేద విద్యార్థులకు మేలు చేయనున్నది.
కరోనా నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించకుండానే ప్రమోట్ చేశారు. గతేడాది ప్రత్యేక తరగతుల నిర్వహణ ఆలస్యం కావడంతో మొత్తం సిలబస్ బోధించలేకపోయారు. దీంతో కేవలం 70 శాతం సిలబస్‌తోనే ఎంపిక చేసిన పాఠ్యాంశాలను బోధించి పరీక్షలు నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో కరోనాకు ముందు ఉన్న పాత విధానంలోనే వంద శాతం సిలబస్ బోధించి పరీక్షలు నిర్వహించనున్నారు. నూతన విధానం అమలు చేస్తూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహించి మెరుగైన ఫలితాల సాధన కోసం సన్నద్ధం చేయనున్నారు.
ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలపై వారానికోసారి పరీక్షలు నిర్వహిస్తాం. ఎంసెట్, నీట్ కోసం ప్రత్యేక తరగతులు తీసుకుంటాం. జిల్లాలో ఈ విధానం అమలు చేసి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మెరుగైన ఫలితాలతో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నాం.
– రఘురాజ్, డీఐఈవో నిజామాబాద్
ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి వారం పరీక్షలు, ఎంసెట్, నీట్ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం అభినందనీయం. దీంతో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ పకడ్బందీగా అమలు చేస్తేనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.
-సంజీవన్‌రావు, రిటైర్డ్ లెక్చరర్