మాక్లూర్, అక్టోబర్ 16 : మండలంలోని చిన్నాపూర్ అర్బన్ పార్కు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ వైపు వస్తుండగా సమస్య తలెత్తడంతో నిలిపివేశారు. నిజామాబాద్ డిపో-2కు చెందిన బస్సు నిర్మల్ నుంచి నిజామాబాద్ వస్తుండగా అతివేగంగా వచ్చి నిలిపి ఉన్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 22 మందిలో 12 మందికి గాయాలయ్యాయి. వరంగల్ బస్సు డ్రైవర్‌తో పాటు నిజామాబాద్‌కు చెందిన డ్రైవర్, కండక్టర్‌ను కలుపుకొని మరో 9 మందికి గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న ఎస్సై యాదగిరిగౌడ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్లో కొంతమందిని పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మిగతా వారిని దవాఖానకు తరలించారు. ఎస్సై యాదగిరిగౌడ్ సమాచారం మేరకు ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు నరేశ్, నరహరి, ఆర్టీసీ మేనేజర్ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అతివేగంగా బస్సు నడిపిన నిజామాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ బాబురాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.