బాన్సువాడ, అక్టోబర్ 15: జీవన శైలి మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా చక్కెర వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీపీ, షుగర్ వ్యాధులబారిన పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తున్నదని తెలిపారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. వయస్సు పెరిగిన తర్వాత సహజంగా బీపీ, షుగర్ జబ్బులు వస్తాయన్నారు. కామారెడ్డి జిల్లాలో 41,058 మందికి షుగర్, 21,217 మందికి బీపీ ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు జబ్బులు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తోందన్నారు. ఆశ కార్యకర్తలు ప్రతినెలా ఇంటి వద్దే అందజేసి అవసరమైన వారికి పరీక్షలు కూడా చేస్తారని చెప్పారు. మందులను సక్రమంగా వాడి వ్యాధులను అదుపులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మాతా శిశు దవాఖాన ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా పిల్లల వార్డులో పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్,ఆర్డీవో రాజాగౌడ్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.