కోటగిరి/బీర్కూర్, అక్టోబర్ 15: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఉమ్మడి జిల్లా లో నిరసన సెగ తగులుతూనే ఉంది. పాదయా త్ర పేరుతో బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆమెకు స్థానికు లు శనివారం చుక్కలు చూపించారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం నుంచి కోటగిరి మండలం ఎత్తొండ క్యాంప్ వరకు చేపట్టిన పాదయాత్రలో షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తుండగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోటగిరి మండలం ఎత్తొండక్యాంప్లో షర్మిల ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారంపై ఆరోపణలు చేస్తుండగా ఎత్తొండ మాజీ సర్పంచ్ వాగ్మారే ఆనంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మీ కాకమ్మ కథలు మాకు చెప్పొద్దు.. వెళ్లి మీ ఆంధ్రలో చెప్పుకోండని సూచించారు. మీ తండ్రి వైఎస్ కార ణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమై, 1200 మంది యువకులు అమరులయ్యారని, ఇంకా మీరొచ్చి తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి…రైతు చనిపోతే రూ.5లక్షలు వస్తున్నాయ్ మాటలు కాదు మేడం…రైతుబంధు పథకం కింద 50 ఎకరాలు ఉన్న రైతులకు కూడా కేసీఆర్ సారు పెట్టుబడి సాయం ఇస్తున్నారు’ అని అన్నారు. ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇక, సంభాపూర్ గ్రామంలోనూ షర్మిలకు నిరసనలు తప్పలేదు. పాదయాత్ర చేస్తూ గ్రామానికి వచ్చిన ఆమెను యువకులు నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ నిర్మించారని ప్రశ్నిస్తున్న మీకు బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్లు కనిపించడం లేదా? అని సంభాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బంగారు రవి.. షర్మిలను ప్రశ్నించారు. మా నియోజకవర్గంలో దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇచ్చారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో నీళ్లు నమిలిన ఆమె.. మాటలను దాటవేసేందుకు ప్రయత్నం చేశారు. అతడి నుంచి మైకు తీసుకొని ఇతర విషయాలను మాట్లాడాలనుకున్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు తదితర విషయాలను వివరిస్తుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.