ఎల్లారెడ్డి, అక్టోబర్ 14 : భారీ వర్షాలకు గుంతల మ యంగా మారిన తారురోడ్లు త్వరలోనే మెరవనున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఆధీనంలో ఉన్న రోడ్ల మరమ్మ మతుకు రాష్ట్రం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించడంతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణతో పాటు.. రహదారులు బాగుంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం,, రహదారుల బాగుకోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో చెడి పోయిన రోడ్ల మరమ్మతు కోసం అధికారులు ప్రతిపాద నలు పంపిన వెంటనే రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూ రు చేయించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు మొత్తంగా రూ.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి.ఈ నిధులతో నాలుగు నియోజక వర్గాల్లో 120 కిలో మీటర్ల మేర మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా తారు రోడ్డు వేస్తారు.
ఎల్లారెడ్డి నియోజక వర్గానికి రూ. 12 కోట్ల64 లక్షలు…
నియోజక వర్గంలోని ఆరు రోడ్లు మరమ్మతు చేసేందుకు రూ.12 కోట్ల 64 లక్షలు మంజూరయ్యాయి. ఆరు రోడ్లకు గాను సుమారు 36 కిలోమీటర్లు మరమ్మతు చేసేందుకు నిధులు మంజూరు కాగా టెండర్లు సైతం అధికారులు పూర్తి చేశారు. లింగంపేట వద్ద 2.33 కిలో మీటర్ల రోడ్డు మరమ్మతుకు రూ.93 లక్షలు, లింగంపేట నుంచి నల్లమడుగుకు 16 కి.మీ గాను రూ.6 కోట్ల 32 లక్షలు, ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ నుంచి సీతాయిపల్లి వరకు 9.30 కి.మీ గాను రూ.3 కోట్ల 23 లక్షలు, ఎల్లారెడ్డి నుంచి భిక్కనూర్ మీదుగా సజ్జన్పల్లి వరకు 7 కిలో మీటర్లకు గాను రూ. కోటీ 24 లక్షలు, లింగంపేట మండలంలోని మోతె, వండ్రికల్, గుర్జాల్లో సీసీ రోడ్డు కోసం రూ. 57 లక్షలు, లింగంపేట మండలంలోని మెంగారం రోడ్డు నుంచి బోనాల్ వరకు 1.15 కి.మీ రోడ్డు కోసం రూ.35 లక్షలు మంజూరయ్యాయి.
జుక్కల్లో 28 కి.మీ మేర పనులు
జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన జుక్కల్ నియోజకవర్గానికి రూ. 15 కోట్ల 57 లక్షలు మంజూ రయ్యాయి. వీటితో నియోజకవర్గంలో 28 కి.మీ మేర పనులు చేయనున్నారు. రూ.7 కోట్ల 47లక్షలతో బాన్సువాడ నుంచి బిచ్కుంద వరకు, రూ.4 కోట్ల 86 లక్షలతో మద్దెల చెరువు-పిట్లం మధ్య రోడ్డు పనులు చేపట్టనున్నారు. రూ. 2 కోట్ల 50 లక్షలతో ఎడ్గి నుంచి మహారాష్ట్రకు వెళ్లే రహదారితో పాటు మరో రూ. 3 కోట్ల 50 లక్షలతో మద్దెల చెరువు-పిట్లం రోడ్డు పనులు చేపట్టనున్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో రెండు రోడ్లకు..
బాన్సువాడ నియోజకవర్గంలో రెండు రోడ్ల కోసం రూ.3 కోట్ల 91 లక్షలు మంజూరు కావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. బాన్సువాడ నుంచి ఉప్పల్ వాయి రోడ్డు మరమ్మతుకు రూ.2 కోట్ల 38 లక్షలు, రూ. కోటీ 53 లక్షలతో దుర్కి నుంచి బీర్కూర్ రోడ్డు పనులు చేపట్టనున్నారు.
కామారెడ్డిలో 38కి.మీ మేర రోడ్డు పనులు
నియోజకవర్గంలోని కేకేవై రోడ్డు మరమ్మతు కోసం రూ. కోటీ 62 లక్షలు, బీబీపేట నుంచి సిద్దిపేట రోడ్డుకు రూ. కోటీ 38 లక్షలు మంజూరయ్యాయి. బీబీపేట నుంచి దోమకొండ రోడ్డుకు రూ.కోటీ 60 లక్షలు, నర్సన్నపల్లి నుంచి భిక్కనూరు రోడ్డుకు రూ. 4 కోట్ల 71 లక్షలు మంజూరయ్యాయి. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి రంగంపేట రైల్వే గేటు వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.57 లక్షలు విడుదలయ్యాయి.
పనులు త్వరలోనే ప్రారంభం
కామారెడ్డి జిల్లాలో ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. వాటి పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. వర్షాకాలం కారణంగా పనులు ప్రారంభం కాలేదు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
నారాయణ, డీఈఈ, ఎల్లారెడ్డి