విద్యానగర్, అక్టోబర్ 14:విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచనలు, విజ్ఞాన ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం విజ్ఞాన్ భారతి, విజ్ఞాన్ ప్రసాద్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ సంయుక్తంగా ‘విజ్ఞాన్ మంథన్’ పేరుతో జాతీయస్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి, జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు అర్హులు. ప్రతిభచూపిన విద్యార్థులకు నగదు రూపంలో ప్రోత్సాహక బహుమతులు అందజేస్తుంది.
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ..
‘విజ్ఞాన్ మంథన్’ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు https:///wm. org.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల నుంచి పాల్గొనే విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాల నుంచి పాల్గొనే విద్యార్థుల వివరాలను అధ్యాపకులు యాప్‌లోనూ నమోదు చేయవచ్చు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. పరీక్ష రుసుము రూ.200 చెల్లించాలి.
పరీక్ష విధానం..
పాఠశాల నుంచి పాల్గొనే 6 నుంచి 9వ తరగతి విద్యార్థులను జూనియర్లుగా, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలో పరీక్షను రాయవచ్చు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 5 వరకు విద్యార్థికి అనుకూలమైన తేదీని ఎంచుకోవచ్చు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల్లో వంద ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్ర్తాల నుంచి 50శాతం, భారతదేశం కృషిపై 20 శాతం, శాస్త్రవేత్తలు-పరిశోధనలపై 20 శాతం, లాజికల్ రీజనింగ్ నుంచి 10శాతం ప్రశ్నలు ఉంటాయి.
ఉత్తమ ప్రతిభకు నగదు ప్రోత్సాహకం..
జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పాల్గొనే విద్యార్థులందరికీ ధ్రువపత్రాలను అందజేస్తారు. రాష్ట్ర స్థాయి లో ప్రతిభ చూపిన తొలి ముగ్గురు విద్యార్థులకు రూ.5 వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు రూ.25వేలు, రూ.15వేలు, రూ.10 వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు.
విద్యార్థులకు అవగాహన కల్పించాలి..
‘విజ్ఞాన్ మంథన్’ పరీక్ష విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవగాహన కల్పించాలి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
-సిద్ధిరాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, కామారెడ్డి