కమ్మర్పల్లి, అక్టోబర్ 12 : మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణ సౌకర్యం ఎంతో దోహదపడుతున్నది. మహిళల్లో వ్యాపార దక్షతను పెంచడమే కాకుండా ఆర్థికపరమైన విశ్వాసాన్ని నింపింది. మహిళలు చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని కుటుంబాల అవసరాలను తీర్చుకోవడంతోపాటు ఆదాయాభివృద్ధి సాధిస్తున్నారు. న్యూ ఎంటర్ ప్రైజెస్ (కొత్త వ్యాపారాలు)ను ప్రోత్సహించడానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితిని గణనీయంగా పెంచింది. దీంతో నిజామాబాద్ జిలాల్లో ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే 88 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు.
మహిళా సంఘాలు లేదంటే సభ్యులు కొత్తగా చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించాలనే సంకల్పంతో న్యూ ఎంటర్ ప్రైజెస్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందు కోసం రుణ పరిమితిని సైతం పెంచింది. గత ప్రభుత్వాల హయాంలో ఒక సభ్యురాలికి రూ.50 వేలు మాత్రమే రుణం ఇచ్చేవారు. మరికొంత పెట్టుబడి అవసరమైనా మూడేండ్ల దాకా మరో రుణం ఇచ్చేవారు కాదు. ఇలా అరకొర రుణ పరిమితితో పాన్‌షాప్ పెట్టుకోవాలన్నా డబ్బులు సరిపోవనే నిరాశ ఉండేది. కానీ కేసీఆర్ సర్కారు రుణ పరిమితిని ఒక్కో సభ్యురాలికి రూ.3 లక్షలు, సంఘానికి రూ.20 లక్షలకు పెంచింది. దీంతో మహిళలు వ్యాపారాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. న్యూ ఎంటర్ ప్రైజెస్ లక్ష్యం సైతం నెరవేరుతున్నది. ప్రభుత్వ లక్ష్యం నీరు గారకుండా ఆదాయాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకే రుణాలు వినియోగమయ్యేలా చూస్తున్నారు. 90 శాతం కొత్త వ్యాపారాల కోసం, 10 శాతం.. ఇదివరకే ఉన్న వ్యాపారాల అభివృద్ధికి రుణాలు ఉపయోగపడేలా అధికారులు దృష్టి పెట్టారు.
నిజామాబాద్ జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 6,265 మందికి రుణాలు మంజూరు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో 4,621 మందికి వ్యాపారాలు గ్రౌండ్ కాగా, 88 శాతం లక్ష్యం పూర్తి చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వందశాతం రుణాల పంపిణీ లక్ష్యం సాధించేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి, డీఆర్డీవో చందర్‌నాయక్, సెర్ప్ అధికారులు సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రుణాల రికవరీ వంద శాతం ఉండడంతో బ్యాంకర్లు సైతం రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.