నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు జీతాలు ఇస్తున్నదని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని కమాండెంట్ ఐఆర్ఎస్ మూర్తి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నిజామాబాద్‌కు బుధవారం వచ్చిన ఆయన.. కమిషనరేట్ పరిధిలోని హోంగార్డు కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
ముందుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల నుంచి వచ్చిన హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ కార్యక్రమం అనంతరం కమాండెంట్ మూర్తి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. అనంతరం పలువురు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.