వేల్పూర్,అక్టోబర్ 10: ఎంపీ అర్వింద్ నిజామాబాద్ జిల్లాకు చేసిందేమీ లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ జై శ్రీరాం అనడం తప్ప చేసిన అభివృద్ధి కూడా ఏమీలేదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరుకాగా, వీటిని సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను వేల్పూర్‌లోని తన నివాసంలో ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. అనంతరం వేల్పూర్ మండలంలోని అక్లూర్, పచ్చల నడ్కుడ, రామన్నపేట్ గ్రామా ల్లో పలు కుల సంఘాల భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, వీటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను కుల సంఘాల ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇప్పటి వరకు 49 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.10కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ జిల్లాకు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. అధికారం ఉన్నది ప్రజలకు మంచి చేయడం కోసమన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనికిరాని అధికారం ఉన్నా ఒకటే ..లేకున్నా ఒక్కటే అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు.
బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క ఆలయానికైనా ఒక్క పైసా కేంద్రం నుంచి మంజూరు చేయించలేదన్నారు. కేవలం వ్యక్తుల మధ్య చిచ్చుపెడుతూ రోజులు గడపడం తప్పగ్రామాలకు చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలకు ఆసరాగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వివిధ కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. గతం లో కుల సంఘాల భవనాలకు ఏ ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, సర్పంచులు పాల్గొన్నారు.
వేల్పూర్, అక్టోబర్ 10: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ మృతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని పేర్కొన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.