నిరంతర శ్రమ, కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం.. సర్కారు సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూనే, రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించే వారికి నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. వారిలో మరింత ఉత్సాహం నింపుతున్నది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆటలో అద్భుతమైన ప్రతిభ కనబర్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు సాధిస్తున్నారు. పట్టుదలతో నిత్యం కఠోర సాధన చేస్తూ పోటీల్లో సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న క్రీడా వసతులను సద్వినియోగం చేసుకుంటున్న సర్కారు పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వాలీబాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక్కడి విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్ క్రీడలంటే ఆసక్తి ఎక్కువ. ఎక్కడ పోటీలు నిర్వహించినా అక్కడికి వెళ్లి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బహుమతులను సాధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు పాఠశాల విద్యార్థులకు క్రీడల్లో రాణించేలా వసతులు కల్పిస్తున్నది. దీంతో తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థులు.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అండర్-14, అండర్-17 విభాగాల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నారు.
తాడ్వాయి ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ 2016 నుంచి 2019 సంవత్సరాల మధ్య దాదాపు 25మంది విద్యార్థులు వాలీబాల్ పోటీల్లో పాల్గొనడానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, చెన్నై, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాలకు వెళ్లారు. అక్కడ నిర్వహించిన పోటీల్ల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి అధికారుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. గ్రామానికి చెందిన దాదాపు 10 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటూ ఆర్మీ, పోలీస్, నేవీ ఉద్యోగాలను సాధించారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారుల ప్రోత్సాహంతో క్రీడా నైపుణ్యాన్ని చాటుతున్నారు. పాఠశాల ఆవరణ సైతం విశాలంగా ఉండడంతో కబడ్డీ, వాలీబాల్ ఆటలకు వేర్వేరుగా మైదానాలను ఏర్పాటు చేసుకొని నిత్యం కఠోర సాధన చేస్తున్నారు. గ్రామానికి చెందిన సమీర్, అరవింద్, మనోజ్, సాయికుమార్, శ్రీకాంత్, నవీన్, రమేశ్, సంతోష్, యోగేశ్, నరేశ్తోపాటు పలువురు ఉత్తమ క్రీడాకారులుగా రాణిస్తూ అందరి మన్ననలను పొందారు.
గ్రామస్తులు, సీనియర్లు గ్రామానికి పేరు తెచ్చేలా ఆడాలని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర, జాతీయ స్థాయిలో తాడ్వాయి గ్రామానికి పేరు సాధించాం. ఇకముందు కూడా మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి సత్తా చాటుతాం.
– యోగేశ్, వాలీబాల్ క్రీడాకారుడు
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఆటల్లో రాణిస్తున్నారు. పట్టుదలతో పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో సైతం ముందుంటూ పాఠశాల, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువస్తున్నారు.
-హీరాలాల్, పీఈటీ, తాడ్వాయిఉన్నత పాఠశాల
వాలీబాల్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే మూడుసార్లు జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. గ్రామంలో చాలా మంది యువకులు వాలీబాల్పై ఆసక్తితో నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నాం. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలను సాధించారు.