ప్రజల ఆకాంక్షకు ప్రజాప్రతినిధుల సహకారం తోడయినా.. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రూ.కోట్లు మంజూరవుతున్నా గుత్తేదారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆగిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
-నవీపేట, అక్టోబర్ 10
నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానానికి నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ఎడపల్లి మండలం జాన్కంపేట నుంచి నవీపేట మండలం ఫకీరాబాద్ వరకు రూ.55కోట్ల తో నాలుగు వరుసల రోడ్డు ను వేయించింది. దీంతో భక్తు లు, ప్రజల ప్రయాణాలు సాఫీ గా సాగుతున్నాయి.
ప్రముఖ దేవస్థానానికి వెళ్లే ప్రధాన రహదారి కావడం తో సుందరంగా కనిపించేలా తీర్చిదిద్దాలని నవీపేట మండలానికి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. అబ్బాపూర్(ఎం), అభంగపట్నం, నవీపేట, నాగేపూర్ వరకు సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్సీ కవిత రూ.1.50కోట్లు మంజూరు చేశారు. ఇదంతా సాఫీగా జరిగినా… కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
కాంట్రాక్ట్ దక్కించుకొని పది నెలల కాలంలో కేవలం అబ్బాపూర్(ఎం) నుంచి అభంగపట్నం వరకు మాత్రమే పనులు చేపట్టారు. నవీపేట, నాగేపూర్ వరకు ఉన్న బాసర రహదారి డివైడర్‌పై లైటింగ్ ఏర్పాటుకు దిమ్మెలు నిర్మించి అలాగే వదిలేశారు. దీంతో లైటింగ్ కోసం తీసుకొచ్చిన స్తంభాలు వర్షానికి తడుస్తూ తుప్పు పట్టే పరిస్థితి ఏర్పడింది. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు పుష్కలంగా ఉ న్నా.. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు చేస్తున్నా.. అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
జాన్కంపేట నుంచి నాగేపూర్ వరకు ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ పనులు అర్ధాంతరంగా నిలిచిన విషయం వాస్తవమే. ఈ పనులకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు అబ్బాపూర్(ఎం),అభంగపట్నం వరకు పనులు పూర్తి చేశాం. జగ్గారావుఫారం వద్ద కూడా లైటింగ్ ఏర్పాటు కోసం అదనంగా మంజూరు లభించింది. వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశాం.
– కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఈ(ఎలక్ట్రికల్),రోడ్లు, భవనాల శాఖ నిజామాబాద్