ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం 75 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి గాను 15 రోజుల ముందుగానే అనగా సోమవారానికే ఈ మార్కును దాటేసింది. వర్షాకాలం ఆరంభం నుంచే ప్రాజెక్టుకు భారీగా వరదలు పోటెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి రికార్డుస్థాయిలో జరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 471.453 టీఎంసీల వరద వచ్చి చేరింది. నాలుగు టర్బయిన్ల ద్వారా రోజుకు 36 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నది. గతేడాది రికార్డును సైతం అధికారులు బ్రేక్ చేసేందుకు కృషి చేస్తున్నారు.
మెండోరా, అక్టోబర్ 10 : ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతున్నది. సీజన్ ఆరంభం నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో ఈ సారి 15 రోజుల ముందుగానే లక్ష్యాన్ని సాధించారు. 75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని లక్ష్యాన్ని విధించుకున్నారు. 15 రోజుల ముందుగానే అనగా సోమవారం నాటికే ఆ మార్కును దాటేశారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచే రిజర్వాయర్‌లోకి భారీగా వరదలు వచ్చి చేరడం.. ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేపట్టడంతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. నాలుగు టర్బయిన్లలో ఒక్కో దానితో 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని జరిగింది. 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ తమ లక్ష్యాన్ని సీజన్ కన్నా15 రోజుల ముందుగానే చేరుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని సాధించగలుగుతామని జెన్కో అధికారులు అంటున్నారు.
ఈ సీజన్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 471.453 టీఎంసీల వరద వచ్చి చేరింది. ఎస్సారెస్పీకి నిరంతరం ఇన్‌ఫ్లో రావడంతో విద్యుత్ ఉత్పత్తి సైతం జోరుగా సాగుతూనే వస్తున్నది. ఈ సంవత్సరం గత ఏడాది కన్నా రికార్డు బ్రేక్ చేసేలా విద్యుత్ అధికారులు ఉన్నారు. దీంతో జెన్కో ఉన్నతాధికారులు జెన్కో అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఇప్పటికే 75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగాం. గత ఏడాది 109 మిలియన్ యూనిట్లు సాధించాం. అంతకన్నా ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
-సి.ప్రభాకర్‌రావు, చీఫ్ ఇంజినీర్