ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఏదో షోరూములో విక్రయించడానికి నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఏడాదిన్నరగా పోలీసుల కండ్లుగప్పి దొంగల ముఠా అపహరించిన వాహనాలు ఇవి.. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు సోమవారం అరెస్టు చేసి రూ.70 లక్షలు విలువ చేసే 42 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు.
నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 10 : జల్సాల కోసం బైక్ చోరీలకు పాల్పడుతూ ఏడాదిన్నర కాలంగా కండ్లు గప్పి తిరుగుతున్న ముఠా గుట్టును నిజామాబాద్ పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ వివరాలను సోమవారం పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హస్మి కాలనీకి చెందిన షేక్ సమదుద్దీన్ 2019లో నిజామాబాద్ లో దొంగతనం కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. బయటికి వచ్చాక నగరంలోని మహమ్మదీయ కాలనీకి చెందిన షేక్ రియాజ్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన మహ్మద్ అబ్బాస్, హై దరాబాద్ శాస్తిపురం కాలనీ పరిధిలో ఉండే అద్నాన్ బి న్ ఒమర్‌తో కలిసి ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలను అపహరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇలా ఏడాదిన్నర కాలంలో బుల్లెట్, యాక్టివా వాహనాలతో పాటు ఇతర బైక్‌లు మొత్తం 42 దొంగిలించా రు. చిన్న వైర్ సహాయంతో క్షణాల వ్యవధిలో వాహనాలను అపహరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. రద్దీ ప్రదేశాలు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాలు, ఇండ్ల ఎదుట పార్క్ చేసిన వాహనాలే వీరి టార్గెట్. దొంగిలించిన వాహనాలను ఇతర రాష్ర్టాల వారికి విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకున్నారు.
ఇటీవల సైతం రెండో టౌన్ పరిధిలో వాహన చోరీపై ఫిర్యాదు రావడంతో ఎస్సై పూర్ణేశ్వర్ కేసు నమోదు చేశారు. అనంతరం వాహనాల దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు సీపీ తెలిపా రు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్సై పూర్ణేశ్వర్, ఏ ఎస్సై రామకృష్ణ వాహనాల దొంగల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరకు నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.70 లక్షలు విలువ చేసే 42 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
ద్విచక్ర వాహన దొంగలను పట్టుకోవడానికి కృషి చేసిన ఎస్సై పూర్ణేశ్వర్, ఏఎస్సై రామకృష్ణతో పాటు కానిస్టేబుళ్లు అఫ్సర్, పవన్, స్వామి, రమేశ్, హోంగార్డులు ఫయాజ్ అలీ, ముజీబ్‌ను సీపీ అభినందించి రివార్డులను అందజేశారు.
ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు దొంగిలించిన వాహనాలను మధ్యవర్తుల సహాయంతో మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల్లో విక్రయించినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. ఆ వాహనాలను అక్కడి నుంచి రికవరీ చేశారు.
ప్రధాన నిందితుడైన షేక్ సమదుద్దీన్ గతంలో ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ఇంటిని సైతం కొనుగోలు చేశాడు.
ఇంత భారీ మొత్తంలో వాహనాల దొంగతనానికి పాల్పడిన ఈ నలుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్, ఎస్సై పూర్ణేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.