ఖలీల్‌వాడి (మోపాల్), అక్టోబర్ 9: మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో ఆదివారం ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ పర్యటించారు. ఇందూరు తిరుమల క్షేత్రం మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. అంతకుముందు సినీ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఎడ్లబండిపై ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వద్దకు వెళ్లారు. వారు పండిస్తున్న వివిధ రకాల పంటలను పరిశీలించారు. అనంతరం వారితో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ..ప్రతి మనిషి అహంకారంతో వివిధ రసాయనాలతో భూమిని నాశనం చేస్తున్నాడని అన్నారు. మనిషికి పెంచుతాను అనే అహంకారం పోయి పెరుగనిస్తాను అనే వినయం రావాలన్నారు. భావితరాలకు ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని అన్నారు. తమ తాతలు బతికినట్లు ఇప్పుడు ఎవరూ బతకడంలేదంటే మనం తినే ఆహారం రసాయనాలతో కూడుకున్నదన్నారు. సేంద్రియ విప్లవ పితామహుడు పాలేకర్‌ను గుర్తుంచుకోవాలని సూచించారు. ఆయన ద్వారానే ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకున్నట్లు తెలిపారు.
భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో సంవత్సరానికి రూ. 3లక్షలు సంపాదించవచ్చని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరాం తెలిపారు. ప్రపంచంలో 60శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. వారి వెంట మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.