రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో రైతులు బోరు బావులతో పాటు కాలువల వెంట మోటర్ల కింద సైతం మీటర్ల రంది లేని వ్యవసాయం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా జలసవ్వడి లేక మూగబోయిన ఎస్సారెస్పీ వరద కాలువ పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వర జలాలతో ప్రస్తుతం నిండుకుండను తలపిస్తున్నది. దీనికి తోడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడంతో బీడుగా ఉన్న వందలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో వరద కాలువ తూముల కింద గ్రావిటీ పారుదలతో ప్రత్యక్షంగా సుమారు 2 వేల ఎకరాలు.. మోటర్ల కింద 350 ఎకరాల వరకు సాగవుతున్నది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సైతం సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ వరద కాలువ వెంట మోటర్లకు మీటర్ల రంది లేకుండా జరుగుతున్న సాగు సంబురాన్ని గుర్తుచేశారు.
కమ్మర్పల్లి, అక్టోబర్ 9 : రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో రైతులు బోరు బావులతోపాటు కాలువల వెంట మోటర్లు ఏర్పాటు చేసుకొని మీటర్ల రంది లేని వ్యవసాయం చేసుకుంటున్నారు. మోటరు ఆన్ చేస్తే మీటర్ గిర్రున తిరిగి మోపెడంత కరెంటు బిల్లు వస్తుందనే భయం లేదు. కాళేశ్వరం, పునర్జీవం లాంటి సాగు నీటి పథకాలతో కాలువల్లో నిండుగా నీళ్లున్నా మోటర్తో పంపు చేసుకుంటే మీటర్ ఉంది కదా అనే చింత లేదు. కానీ మోటర్లకు మీటర్లు రానున్నాయా ?..రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సాగు, కరెంటు, సంక్షేమ పథకాలు అందజేసుకుంటున్న రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాట ఫలితంగా మీటర్ల ప్రయత్నాలు కాస్త ఆగుతున్నాయా అనే చర్చ రైతుల్లో కొంత కాలంగా కొనసాగుతున్నది. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ వరద కాలువ వెంట మోటర్లకు మీటర్ల రంది లేకుండా జరుగుతున్న సాగు సంబురాన్ని గుర్తు చేశారు. దీంతో రైతుల్లో చర్చ నెలకొన్నది. గ్రావిటీతోనే కాకుండా పంపుల ద్వారా నీటిని తోడుకునేలా వరద కాలువ పురుర్జీవ పథకంతో అందివచ్చిన తీరును రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
నిండుకుండలా వరద కాలువ
దశాబ్దాలుగా బీడు వారిన భూమిని తలపిస్తూ, తుమ్మ మొద్దులతో నిండి నిరుపయోగంగా మారిన వరద కాలువ సీఎం కేసీఆర్ మేథోమధనం, ఆయన దిశానిర్దేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో పునర్జీవ పథకం ద్వారా వరద కాలువ కాళేశ్వరం జలాలతో నిండు కుండలా మారిన విషయం తెలిసిందే. వరద కాలువకు మూడు కాలాలు నీటి లభ్యత ఉండడంతో వంద కిలో మీటర్ల పొడవైన రిజర్వాయర్లా మారుతున్న తరుణంలోనే కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని తెచ్చారు. కాళేశ్వరం జలాలు ఎగువకు రాగా.. ఉచిత కరెంటు పథకం కాలువ వెంట ముఖ్యంగా కుడి వైపున వందలాది ఎకరాల్లో బీడు భూములను సాగు లోకి తెచ్చింది. ఇలా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోనూ ఎస్సారెస్పీ నుంచి మొదలు జిల్లా సరిహద్దు వరకు 36 కిలోమీటర్ల వరకు మోటర్లతో భూముల సాగు జరుగుతున్నది. బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో వరద కాలువ తూముల కింద గ్రావిటీ పారుదలతో ప్రత్యక్షంగా సుమారు 2 వేల ఎకరాలు ఉంటే 350 ఎకరాల వరకు మోటర్ల కింద సాగు జరుగుతున్నది.
రైతులకు తగ్గిన ఖర్చుల భారం
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోని నాన్ కమాండ్ ప్రాంతాల్లో ఐదెకరాలకు మూడు బోరు బావులు అవసరం అయ్యేది. వేసవిలో లోఓల్టేజీ, భూ గర్భ జలాలు అడుగంటడం లాంటి సమస్యలతో మోటర్లు కాలి పోయి రైతులు తీవ్ర ఖర్చుల పాలయ్యే వారు. పంట ఎండి పోవడమూ జరిగేది. కానీ నేడు వరద కాలువలో నిండుగా ఉంటున్న నీటితో ఐదెకరాలకు ఒకటి లేదా రెండు మోటర్లు సరిపోతున్నాయి. పైగా లోఓల్టేజీ సమస్య లేకపోవడంతో మోటర్లు కాలిపోవడం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రైతుకు ఖర్చుల భారం లేకుండా పోయింది. దీనికి తోడు ఉచిత కరెంటుతో మీటర్ల రందీ లేనే లేదు. ఉచిత కరెంటు లేక.. మీటర్ గోల ఉండి ఉంటే వరద కాలువ మోటర్ల సాగుకు ఇంతలా ఉపయోగపడేది కాదు. కేసీఆర్ నిజామాబాద్ సభలో వరద కాలువలో మీటర్లు లేని సాగుపై మాట్లాడాక ఈ విషయంపై రైతుల మధ్య చర్చ ప్రారంభమైంది.
కేసీఆర్‌తోనే మీటర్లు లేని మోటర్లు
రైతును ప్రోత్సహించాలన్న తపనతో కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టులు కట్టారు. వీటితో పాటు ఉచిత కరెంటు ఇచ్చారు. ఉచిత కరెంటు ఇచ్చి ఉండకపోతే మోటర్లకు మీటర్లు వచ్చేవి. దీంతో ఎత్తున ఉన్న, కుడి వైపున ఉన్న భూములకు వరద కాలువ ద్వారా ఎటువంటి ప్రయోజనం చేకూరేది కాదు. మీటర్లు లేని మోటర్లు ఉండక పోయేవి.
-మల్కాయి రాజన్న, వరద కాలువ రైతు, కమ్మర్పల్లి
కేసీఆర్ చెప్పింది వంద శాతం నిజం
వరద కాలువలో మోటర్లకు మీటర్లు లేని రంది లేని సాగుపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్లో వంద శాతం నిజం ఉంది. ఉచిత కరెంటు ఇచ్చి రైతును ఆదుకోక పోతే మీటర్ల కరెంటుతో రైతు కోలుకునే వాడు కాదు. కాలువల్లో రైతుకు మీటర్లు లేని మోటరు సాగు అందుతున్నదంటే ఉచిత కరెంటు పుణ్యమే.
-గంగారెడ్డి, రైతు, కమ్మర్పల్లి