రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’.. భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. 22 నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్.. రెవెన్యూ సేవలను మరింత సులువు చేసింది. భూ వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తవుతున్నది. భూ పట్టాల మార్పిడి ప్రక్రియ నిమిషాల్లోనే అయిపోతున్నది. అంతేకాదు, అధికారుల అవినీతికి కళ్లెం పడింది. గతంలో సాగు భూముల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. డాక్యుమెంట్ రైటర్లు, ఆఫీసు సిబ్బందికి బోలెడంత డబ్బు ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరమే లేదు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని సంబంధిత తహసీల్ కార్యాలయానికి వెళ్తే నిమిషాల వ్యవధిలోనే పట్టా మార్పిడి, హక్కుల బదలాయింపు చేసేస్తున్నారు. అది కూడా నిర్ణీత రుసుం మాత్రమే తీసుకుని సేవలందిస్తున్నారు. సీఎం కేసీఆర్ దార్శనికత ఫలితంగా అత్యంత వేగంగా, అదనపు ఖర్చు లేకుండా భూముల క్రయ, విక్రయాలు పూర్తవుతున్నాయి.
నిజామాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధరణి పోర్టల్.. భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఏకకాలంలోనే భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతున్నది. బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్లు విత్ డ్రా చేసుకున్న తీరుగానే భూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పాస్‌బుక్ జారీ ప్రక్రియ క్షణాల్లో జరిగి పోతున్నది. గతంలో వ్యవసాయ భూముల లావాదేవీలు జరగాలంటే ముందు రోజు డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్ రాయించుకుని మరుసటి రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. పొద్దున వెళ్తే సాయంత్రానికి కానీ బయటకి వచ్చేవారు కారు. ఆ తర్వాత హక్కు మార్పిడి కోసం ఆ డాక్యుమెంట్లను తీసుకుని తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాల్సి వచ్చేది. భూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం రెండు ఆఫీస్‌లకు తిరగాల్సి వచ్చేది. పైగా రికార్డుల్లో పేరు మారడానికి నెలల సమయం పట్టేది. దీని వల్ల రైతులకు డబ్బుతో పాటు సమయం వృథా అయ్యేది. ఈ ఇబ్బందులకు ధరణి పోర్టల్ చెక్ పెట్టింది. ధరణి సేవల పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నది. 22 నెలల కాలంలోనే 45 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు నిజామాబాద్ జిల్లాలో జరగడం ఇందుకు నిదర్శనం.
అన్ని సేవలు ఒకేచోట..
ఆస్తి రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకు రావడానికి, ఆస్తి లావాదేవీల ప్రక్రియను సులభతరం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అక్టోబర్, 2020లో ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ల్యాండ్ మ్యుటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా మారింది. డిజిటల్‌గా ల్యాండ్ రికార్డులను తీసుకు రావడంతో పారదర్శకత పెరిగింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మోసాలు తగ్గాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ప్రాపర్టీలు రెండింటికీ ఈ ధరణి పోర్టల్ పని చేస్తుంది. ధరణి పోర్టల్ వచ్చిన అనంతరం ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతున్నది. పాత యజమాని పాస్‌బుక్‌ను అప్డేట్ చేసి, కొనుగోలుదారుడికి కొత్త పాస్‌బుక్ ఇస్తున్నారు. వ్యవసాయేతర భూములకు మెరూన్ రంగు, వ్యవసాయ భూములకు ఆకుపచ్చ రంగు పాస్‌బుక్‌లను జారీ చేస్తున్నారు.
అరిగోస తప్పింది..
ధరణి రావడానికి ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ దారుణంగా ఉండేది. ముందుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్, ఆ తర్వాత రెవెన్యూ శాఖలో మ్యుటేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక, ఆ సేల్ డీడ్‌తో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. చేసుకోకపోతే రెవెన్యూ రికార్డుల్లో పాత యజమాని పేరే ఉంటుంది. భూమి మీద పూర్తి హక్కులు రావాలంటే మ్యుటేషన్ జరిగి తీరాలి. మ్యుటేషన్ ప్రక్రియ ముందుగా వీఆర్వో దగ్గర మొదలై తహసీల్దార్ అటు నుంచి ఆర్డీవో దాకా వెళ్తుంది. ఆర్డీవో సంతకం జరిగాక కానీ పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేది కాదు.
ఇందుకోసం ఏళ్ల కొద్దీ పడిగాపులు కాయాల్సి ఉండేది. డబ్బులు ఖర్చు చేసుకున్నా, కాళ్లరిగేలా తిరిగినా పనులు త్వరగా జరిగేవి కావు. ప్రస్తుతం కాలగర్భంలో కలిసిన వీఆర్వో పోస్టు పేరిట కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా పేర్లు మార్చేసి రైతులను అరిగోస పెట్టేవారు. రికార్డుల్లో పేరు, విస్తీర్ణం ఇష్టం వచ్చినట్లు మార్చేయడం భూ వివాదాలకు దారితీశాయి. ఇలాంటి వివాదాలు కొన్ని చోట్ల అవి ఏకంగా హత్యలు, దాడులకు సైతం దారి తీశాయి. అయితే ధరణి రాకతో భూ వివాదాలకు పరిష్కారం లభించింది. ఫలితంగా భూ వివాదాల వల్ల ఏర్పడే శాంతిభద్రతల సమస్య కూడా తగ్గింది.
అత్యంత సులభం..
భూ రికార్డుల నిర్వహణ, లావాదేవీలకు సంబంధించి ధరణి పోర్టల్ విజయవంతంగా సేవలు అందిస్తోంది. వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలను అత్యంత సులభంగా, వేగంగా పూర్తి చేస్తూ కొత్త చరిత్రను లిఖించింది. శతాబ్దాల నాటి చట్టాల బూజు దులిపి, అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టంలో ధరణి కీలకంగా మారింది. ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ప్రారంభించారు. నాటి నుంచి 22 నెలలుగా భూ లావాదేవీలు నిర్వహిస్తూ, భూ సమస్యలను పరిష్కరిస్తూ అండగా నిలుస్తున్నది.
కూర్చున్న చోట నుంచే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని, సంబంధిత సమయానికి తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్తే నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. పైగా ధరణిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవు. మ్యుటేషన్ కోసం, రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరముండదు. పైరవీలు చేయాల్సిన పని లేదు. ఎక్కడా రూపాయి అవినీతి లేకుండా కొనుగోళ్లు, అమ్మకాలు నిమిషాల్లో చకచకా పూర్తవుతున్నాయి. ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కాకుండా భూ లావాదేవీలు సాఫీగా సాగిపోతున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకే పరిమితమైన భూ లావాదేవీలు ఇప్పుడు మండల కేంద్రాల్లో కూడా జరుగుతుండడంతో ప్రజలకు సౌలత్ పెరిగింది.
45 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు..
నిజామాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో ఇప్పటివరకు 45,451 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 3,500 నాలా కన్వర్షన్, 7,141 వారసత్వం, 7,931 పెండింగ్ మ్యుటేషన్లు, 176 పార్టిషన్ కేసులు చేసి పాస్ పుస్తకాలు జారీ చేశారు. అలాగే, పార్ట్-బీలో ఉన్న భూములకు సంబంధించి ఇప్పటి వరకు 21,315 భూ సమస్యల గురించి దరఖాస్తులు రాగా, అందులో 19,443 దరఖాస్తులు పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులు పురోగతిలో ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
నిమిషాల్లోనే సాగు భూముల రిజిస్ట్రేషన్లు..
ధరణి వచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులువైంది. జిల్లాలో 95 శాతం భూ వివాదాలను పరిష్కరించాం. సివిల్ వివాదాల్లో ఉన్న భూములను మినహాయిస్తే అన్ని రకాల లిటిగేషన్ కేసులకు పరిష్కారం చూపాం. 21 వేల కే సులను పరిష్కరించి, ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాం. 15 నిమిషాల్లోనే ధరణిలో సాగు భూమికి సంబంధించిన హక్కు పత్రాల మార్పు జరిగి పోతున్నది. ధరణి అన్నది ఒక అద్భుతమైన పోర్టల్. దీని వల్ల అనేక సమస్యలకు విరుగుడు లభించింది. ధరణి ద్వారా పొందిన పట్టాదారు పాసు పుస్తకం అత్యంత విలువైంది. చట్టపరంగానూ రక్షణ ఉంది. పోర్టల్‌లో పేరు మా రడంతోనే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు సంబంధిత వ్యక్తి అర్హుడిగా ప్రభుత్వం గుర్తించి తదుపరి జాబితాలో చేర్చడం జరుగుతుంది. 45 వేలకు పైగా రిజిస్ట్రేషన్లతో ధరణి లో నిజామాబాద్ జిల్లా దూసుకుపోవడం సంతోషంగా ఉంది.
– సి.నారాయణ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్