స్వాతంత్య్ర భారతావనిలో 75 ఏండ్లు పాలించిన జాతీయ రాజకీయ పార్టీలు చేసింది శూన్యమే. ఇన్నేండ్లు పాలించినా దేశంలో ఇంకా పేదరికం ఉన్నది. అట్టడుగువర్గాలు అక్కడే ఉన్నాయి.. కార్పొరేట్ శక్తులు దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలంటే… సరైన నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశం ఎదురుచూస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయంలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తీరును యావత్ దేశం గమనిస్తున్నది. వ్యవసాయానికి ప్రభుత్వ మద్దతు ఎలా ఉండాలని రైతులంతా కోరుకుంటున్నారో… అలాగే తెలంగాణ మోడల్ అమలవుతుండడం వారిని కేసీఆర్‌కు మరింత దగ్గరచేసింది. స్వయంగా రైతు అయిన కేసీఆర్ మాత్రమే తమను సరైన మార్గంలో నడిపించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి పంట నూర్పిడి కోసం వచ్చిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రైతులు తెలంగాణలో సాగవుతున్న పంటలు, ఇక్కడి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను స్వయంగా తెలుసుకొని ఇలాంటి నేత దేశానికి ప్రధాని కావాలని చెబుతుండడం విశేషం. భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన టీఆర్ఎస్.. తెలంగాణలో అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టుల విషయాలను తెలుసుకొని అభినందిస్తున్నారు. ఇలాంటి నాయకుడికి దేశాన్ని పాలించే అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి ఎక్కడ పోటీ చేసినా గెలుపొందడం ఖాయమని వివరిస్తున్నారు.
నా పేరు మంజీద్. మాది హర్యానా. నేను ప్రతి సంవత్సరం సోయా నూర్పిడి యంత్రంతో బిచ్కుందకు వస్తాను. ఇక్కడి రైతులు సాగు చేసిన పంటను నూర్పిడి చేసి క్వింటాలుకు రూ.100 తీసుకొంటాను. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా… రైతుల గురించి పట్టించుకునే సర్కారు ఇక్కడ ఉన్నది. సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకంతో అప్పులు లేకుండా రైతులు పంటలను సాగుచేస్తున్నారు. మా రాష్ట్రంలో అప్పులు చేసి పంటలు సాగు చేసినా… సరైన సౌకర్యాలు లేక పంటలు పండడం లేదు. ఇక్కడున్న సీఎం కేసీఆర్… దేశానికి నాయకుడైతే మాలాంటి రైతులందరూ వ్యవసాయంలో రాణిస్తారు.
నా పేరు జమీల్ ఖాన్. మాది రాజస్థాన్. ప్రతి సంవత్సరం బిచ్కుంద మండలానికి ట్రాక్టర్ యంత్రం తీసుకొని వస్తాను. ఇక్కడి రైతులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేయడంతో రైతులు లక్షాధికారులు అయ్యారు. పంటలు సాగు చేసుకోవడానికి రైతుబంధు డబ్బులు చాలా ఉపయోగపడుతున్నాయి. నాకు రాజస్థాన్‌లో రెండు ఎకరాల భూమి ఉన్నది. కేసీఆర్ ప్రధాని అయి, మా రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేస్తే అక్కడి రైతులు కూడా అభివృద్ధి చెందుతారు.
నా పేరు బన్సీలాల్. మాది మధ్యప్రదేశ్. నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. మా రాష్ట్రంలో పంటలు సరిగ్గా పండవు. అందుకే నేను సోయా నూర్పిడి ట్రాక్టర్‌తో బిచ్కుందకు వచ్చాను. ఇక్కడి రైతులను చూసి మా దగ్గర కూడా ఇలాంటి పథకాలు ఉంటే బాగుండు అని కోరుకుంటున్న. సీఎం కేసీఆర్‌లాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయితే తెలంగాణలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు మా రాష్ట్రంలో కూడా అమలవుతాయి. మేము కూడా అభివృద్ధి చెందుతాము.