వర్ని, అక్టోబర్ 3: రాష్ట్రంలోనే వరి సాగులో ప్రత్యేక గుర్తింపు ఉన్న వర్ని మండలంలో కోతలు ప్రారంభమయ్యాయి. ప్రతిఏడాది ప్రణాళికాబద్ధంగా వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించడంలో ఇక్కడి రైతులకు మంచిపేరుంది. రాష్ట్రం లో అన్ని ప్రాంతాల కన్నా ముందుగా వరి నాట్లు వేసి, ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ దిగుబడులు సాధించడానికి ప్రణాళికాబద్ధంగా సాగుచేస్తారు. ఎకరానికి 45 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి సాధించడం గమనార్హం. ఉమ్మడి మండలంలోని వర్ని, హుమ్నాపూర్, ఘన్పూర్, చందూ ర్ తదితర ప్రాంతాల రైతులు నెల రోజుల ముం దుగానే దిగుబడి సాధించి రాష్ట్రంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్ని – బోధన్ ప్రధా న రహదారి పక్కన ఉన్న సుమారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఓ రైతు సోమవారం వరి కోతలు ప్రారంభించారు. ఎకరానికి సుమారు 50 బస్తాల దిగుబడి వచ్చిందని సదరు రైతు వీరభద్రయ్య తెలిపాడు. ధాన్యాన్ని క్వింటాలుకు 1,900 రూపాయల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2,030 మద్దతు ధర కల్పించడంతో ప్రైవేటు వ్యాపారులు ఈ మాత్రం చెల్లిస్తున్నారని తెలిపాడు. వరి కోతలు ఊపందుకుంటే ధాన్యం ధరను తగ్గిస్తారన్నాడు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి రైతులకు లబ్ధి చేకూర్చాలని వారు కోరుతున్నారు.