నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 24 : తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ నాయకులను తరిమికొట్టాలని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. నగరంలోని ఒకటో డివిజన్ ఖానాపూర్ పరిధిలో ఉన్న పవార్గార్డెన్లో ఐదు గ్రామాలకు చెందిన 770 లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలు, కార్డులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యతను విస్మరించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు రగిలిస్తున్నదని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు చెప్పే అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. జిల్లా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కేవలం మీడియా వేదికగా సీఎం కేసీఆర్, వారి కుటుంబీకులనే తిట్టడమే పనిగా పెట్టుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డిని స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కోర్వ లలితాగంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, యమునాఅనిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుకర్‌రావు, ఎంపీపీ అనూషా ప్రేమ్‌దాస్, వైస్ ఎంపీపీ సాయిలు, నుడా డైరెక్టర్లు ముస్కె సంతోష్, అభిలాష్‌రెడ్డి, సర్పంచులు అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, పాల్దా సొసైటీ చైర్మన్ జితేందర్, టీఆర్ఎస్ నాయకులు శంకర్, స్వామి, మోహన్, అక్బర్, గోపాల్, విద్యాసాగర్ పాల్గొన్నారు.
డిచ్పల్లి/ రుద్రూర్, సెప్టెంబర్ 24 : జక్రాన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్ట్రీషియన్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన ఎండీ ఆసిఫ్‌కు టీఆర్ఎస్ పార్టీ ద్వారా రూ. 2లక్షల బీమా చెక్కు మంజూరైంది. బాధిత కుటుంబానికి చెక్కును ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ కుంచాల విమలారాజు, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు నట్ట భోజన్న, సర్పంచ్ చంద్రకళా బాలకిషన్, ఎంపీటీసీ గంగారెడ్డి, నాయకుడు సతీశ్ పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి తల్లి అమ్మాయి ఈనెల 22న అనారోగ్యంతో మృతిచెందింది. మాజీ సర్పంచ్ కుటుంబాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. కామారెడ్డి జిల్లా డీఆర్డీవో సాయన్న, జక్రాన్‌పల్లి తహసీల్దార్ మల్లేశ్‌ను సైతం ఎమ్మెల్యే పరామర్శించారు.