మాక్లూర్/నవీపేట, సెప్టెంబర్ 24: మండల కేంద్రంలోని రైతు వేదికలో పోడు భూములు(రికార్డు ఆఫ్ ఫారెస్ట్) అంశంపై తహసీల్దార్ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పోడు భూములు కలిగిన ఉన్న రైతులకు పట్టాలు ఇచ్చే క్రమంలో భాగంగా ఆ భూములకు సంబంధించిన విధి విధానాలు, వారు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన కోసం మండలంలో ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బృందంలో ఏఈవో, ఫారెస్ట్ బీట్ అధికారి, సర్వేయర్, కార్యదర్శి సభ్యులుగా ఉంటారని చెప్పారు. సోమవారం నుంచి మండలంలో వారు పర్యటించి దరఖాస్తులపై విచారణ జరిపి నివేదికలు అందజేస్తారన్నారు. ఏవో పద్మ, డిప్యూటీ ఫారెస్టు అధికారి పాల్గొన్నారు.
నవీపేట మండలంలోని నందిగామ, మిట్టాపూర్, మద్దేపల్లి గ్రామాల్లో ఉన్న గుట్టల ప్రాంతాల్లో 108 ఎకరాల పోడు భూముల పంపిణీకి రంగం సిద్ధం చేయాలని తహసీల్దార్ వీర్‌సింగ్ పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం కింద 2005 డిసెంబర్ 13 కంటే ముందు ఖబ్జాలో ఉండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారితో ఆయా గ్రామాల్లో ఈనెల 26న గ్రామ సభలను ఏర్పాటు చేసి విచారణ జరిపి అర్హులను గుర్తిస్తామని అన్నారు. మండలంలో ఎస్టీలు 19, ఇతర కులాల వారు 64 మంది ఉన్నారని అన్నారు. రెవెన్యూ, ఫారెస్టు, అగ్రికల్చర్, పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలను నిర్వహించి పోడుభూముల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతారని తహసీల్దార్ పేర్కొన్నారు. డిప్యూటి తహసీల్దార్ సవాయ్సింగ్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సురేశ్‌గౌడ్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ సౌమ్య పాల్గొన్నారు.