నదులు మానవ జీవన వికాస కేంద్రాలు. ఎంత ప్రవహించినా తరగిపోకుండా తరలిపోతూనే ఉండే తరంగిణి మానవ ఆవాసాలకు, విభిన్న జీవా జాలాలకు మనుగడను, అభివృద్ధిని అందిస్తూనే ఉంటుంది. తన పరీవాహక ప్రాంతాలకు జీవ ధారలు అందిస్తూ ఆ ప్రజలచే అభివృద్ధి, ఆధ్యాత్మిక, సంప్రదాయ, సాంస్కృతిక బంధాన్ని ఏర్పర్చుకుంటుంది నదీమ తల్లి. నదులతో అలాంటి బంధాన్ని కలిగి ఉన్నది ఇందూరు జిల్లా. జిల్లా ముఖ చిత్రంలో ఉన్న గోదావరి, మంజీర, హరిద్ర నదులు అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. త్రివేణి సంగమంతో సహా గోదారి వెంట ఆధ్యాత్మిక క్షేత్రాలు, గోదావరి, మంజీరా నదుల జలాలు జిల్లాతో అనుబంధాలను పెనవేసుకుని సాగుతున్నాయి. ప్రపంచ నదుల దినోత్సవాన్ని 2005 నుంచి ఏటా సెప్టెంబర్ చివరి ఆదివారం నిర్వహిస్తుండగా..మన దేశంలోనూ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నదులతో జిల్లా బంధాన్ని గుర్తు చేసుకుందాం..
– కమ్మర్పల్లి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తున్నది. జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద ప్రవేశించి ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ వరకు పయనిస్తుంది. జిల్లాలో 91,750 చదరపు కిలో మీటర్ల క్యాచ్మెంట్ ఏరియాలో విస్తరించి 139 కిలో మీటర్ల పొడవున రెంజల్, బోధన్, నవీపేట్, నందిపేట్, ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండలాల మీదుగా ప్రవహిస్తుంది. గోదావరి నదిపై మెండోరా మండలం పోచంపాడ్ వద్ద శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు, ఎగువ ప్రాంతంలో గోదావరి ఆధారంగా గుత్ప, అలీ సాగర్, దిగువన నవాబు, బోదెపల్లి, వేంపల్లి, హన్మంత్ రెడ్డి, నాగాపూర్, గుమ్మిర్యాల్ ఎత్తిపోతలు, ఎస్సారెస్పీ కాకతీయ, లక్ష్మి, వరద కాలువ ద్వారా జిల్లాలో సాగు నీరు అందుతున్నది. తద్వారా ప్రజల జీవనోపాధి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నది గోదావరి నది. జిల్లాలో ప్రవహించే గోదావరి ఉప నది మంజీర నది. ఉప నదుల్లో గోదావరిలో కలిసే మొదటి ఉప నది మంజీర. మంజీరా నదీ జలాలు సైతం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ జిల్లాలో భూములను తడుపుతూ సస్యశ్యామలం చేస్తున్నాయి.
గోదావరి, మంజీర, హరిద్ర నదులు దశాబ్దాలుగా జిల్లా ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో భాగమయ్యాయి. గోదావరి నదిని గంగమ్మ తల్లిగా కొలుస్తారు. గోదావరి నదికి మొక్కులు, తల నీలాలు, ఖుషీ తెప్పలు సమర్పిస్తారు. గోదావరి, గంగ, గంగా దేవి, గంగాధర్, గంగారాం, గంగోత్రి, తరంగిణి, గంగా సాగర్, గంగా జల, గంగా ప్రసాద్, గంగా జమున, భాగీర, హరిద్ర, త్రివేణి, సంగమేశ్వర్ లాంటి పేర్లు పెట్టు కోవడం గోదావరి, మంజీర, హరిద్ర నదులతో ఆధ్యాత్మిక బంధానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
రెంజల్ మండలంలో గోదావరి ప్రవేశించిన చోట గోదావరితో మంజీర, హరిద్ర నదులు కలిసే త్రివేణి సంగమం సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా విలసిల్లుతున్నది. హరిద్ర నది పాప హరితంగా, రోగ విముక్తి కారిణిగా పూజలు అందుకుంటున్నది. గోదావరి వెంట రెంజల్ మండలంలో కందకుర్తి, తాడ్ బిలోలి, నవీపేట్ మండలంలో కోస్లీ, బినోల, తుంగిణి, నందిపేట్ మండలంలో ఉమ్మెడ, మెండోరా మండలంలో పోచంపాడ్, సావెల్, ఏర్గట్ల మండలంలో తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ క్షేత్రాలు గోదావరి పుణ్య క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
స్వరాష్ట్రంలో నదీ జలాలను వ్యవసాయానికి అందించే కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో జిల్లాలోనూ గోదావరి నది జలాలను విస్తృతంగా అందించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఎస్సారెస్పీ బ్యాక్ ఏరియా నుంచి గోదావరి జలాలను తరలించి జిల్లాలోని బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో వేలాది ఎకరాలకు శాశ్వత సాగు భరోసా కల్పించనున్నారు. అటు గోదావరి పుష్కరాలతో జిల్లాలో పుష్కర ఘాట్లు, క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో ప్రజల్లో ఆధ్యాతిక భావన పెరిగింది.