విద్యానగర్, సెప్టెంబర్ 17: ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న రాజరికపాలన వద్దని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి స్వతంత్ర భారతావనిలో విలీనం చేయించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లెలు,పట్టణాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని చెప్పారు.
ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24గంటల పాటు ఉచిత విద్యుత్, దళితబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. గతంలో రైతులు వ్యవసాయం చేయడానికి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసేవారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చారని వివరించారు. ప్రాంతాభివృద్ధికి నాయకులు పోటీపడి ప్రజాసేవ చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించడంలో జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పని చేస్తున్నదని అభినందించారు.
కామారెడ్డి మెడికల్ కాలేజీకి ప్రభుత్వం రూ.230 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 238 గురుకుల పాఠశాలలు ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత వాటి సంఖ్య 1000కి పెరిగిందని వివరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని, సీఎం కేసీఆర్ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్‌షిండే, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్ దోత్రే, చంద్రమోహన్, శిక్షణా కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.