దేశ స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని ప్రజలు, ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ దేశంలోని నిరుద్యోగుల పొట్టగొడుతున్నది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. అగ్నిపథ్ పేరిట సైనిక నియామకాల్లో గందరగోళం తీసుకొచ్చి లక్షలాది మంది యువకుల ఆశలపై నీళ్లు చల్లింది. మోదీ ప్రభుత్వం నిరుద్యోగ యువత బంగారు జీవితాలను ఎటూకాకుండా చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు అడుగడుగునా మొండి చేయి చూపిస్తున్నది. ఇందుకు పూర్తిభిన్నంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచి అండగా నిలుస్తున్నారు. ఎనిమిదేండ్ల కాలంలో లక్షా 30వేల ఖాళీలను ప్రభుత్వ రంగంలో భర్తీ చేయడంతో పాటు వచ్చే కొద్ది రోజుల్లోనే 80వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్షేమ పథకాలతోపాటు ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉద్యోగ సంఘాలు, నాయకులు కోరుతున్నారు. ఆయన నాయకత్వంలో దేశం స్వర్ణభారత్గా అవతరిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగ యువత పొట్ట కొడుతోంది. కొత్తగా ప్రభుత్వ సెక్టార్లో నియామకాలు చేపట్టకుండా నియంతృత్వ ధోరణిలో వెళ్తోంది. అగ్నిపథ్ పేరిట సైనిక నియామకాలకు తెరలేపి లక్షలాది మంది యువకుల ఆక్రందనకు ఇదే మోదీ ప్రభుత్వం కారణమైంది. చేసేది లేక రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసి యువకులు తమ బతుకులను బుగ్గిపాలు చేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వ నీచమైన వ్యవహారంతో బంగారం లాంటి జీవితాలు ఎటూ కాకుం డా పోయాయి. మోదీ సర్కారు ఓ వైపు నిరుద్యోగులకు, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు అడుగడుగునా మొండి చేయి చూపిస్తోంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కొండంత అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎనిమిదేండ్ల కాలంలో లక్షా 30వేల ఉద్యోగాలను ప్రభుత్వ రంగంలో భర్తీ చేయడంతో పాటు మరికొద్ది రోజుల్లోనే 80వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సర్కారు యావత్ దేశాన్ని కార్పొరేట్‌మయం చేస్తుంటే .. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకుంటూ సీఎం కేసీఆర్ మా త్రం యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి నేత ముందు కు రావాలని ఆయా ఉద్యోగ సంఘాలకు చెంది న నాయకులు చెబుతున్నారు.
నిత్యం డాంబికాలు ప్రదర్శించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను పదవి చేపట్టిన ఎనిమిదేండ్ల కాలంలో ఉద్యోగుల సంక్షేమం కోసం చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. పైగా పన్ను స్లాబులను ఎడాపెడా మార్చేస్తూ ఉల్టా పన్ను పోటుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇలా ఆర్థిక ఇబ్బందులకు మూల కారణంగా నిలుస్తోన్న భారతీయ జనతా పార్టీ ఒక్క క్షణం కూడా ప్రభుత్వ ఉద్యోగుల దీనావస్థను పట్టించుకోవడం లేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కోసం ఏండ్లుగా ఉద్యోగులంతా దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఉలుకూ పలుకు లేకుండా నిస్తేజంగా పడి ఉంది.
ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి దమ్మూ ధైర్యం కలిగిన నాయకులతోనే సాధ్యం అవుతుందని ఆ యా ఉద్యోగుల సంఘాల నాయకులు చెబుతున్నారు. పరిపాలన వ్యవస్థలో అనేక సంస్కరణలకు తెర లేపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేశ రాజకీయాల్లో తగిన చోటు కల్పిస్తే అద్భుతాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మన్‌కీ బాత్, సభలు, సమావేశాల్లో మైకుల ముందు ఊదరగొట్టే ప్రసంగాలు తప్పా మోదీ సర్కారులో ఉద్యోగులకు ఒనగూరిందేమీ లేదన్నది తేలిపోయింది.
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని విధంగా మేలు చేకూరుతోంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అనేక ఉద్యమ ఘట్టాల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులను మొదట్నుంచీ సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన పొరపాట్లు, లోపాలను సవరించి వారికి ఇంక్రిమెంట్లు, డీఏ పెంపు విషయంలో న్యాయం చేస్తున్నారు.
పీఆర్సీని సైతం ఆశించిన స్థాయిలో పెంచి అమలు చేయడంతో ఉద్యోగుల నమ్మకాన్ని కేసీఆర్ చూరగొన్నారు. దేశంలో గడిచిన ఎనిమిదేండ్లలో ఉద్యోగుల సంక్షేమం అటకెక్కింది. కొత్తగా నియామకాలు లేవు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై కనీసం చర్చనే లేకుండా పోయింది. ఇలాంటి కీలకమైన సమయంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్య పాత్ర వహిస్తే దేశంలోని కోటీ 80లక్షల మంది ఉద్యోగులకు లాభం జరుగుతుందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 61ఏండ్లు ఉద్యోగ విరమణ వయస్సు పెంపుతో భారీ సంస్కరణను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రధాని పదవి దక్కితే దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు మంచి రోజులు దక్కుతాయని వారంతా చెబుతున్నారు.
నా సర్వీసులో ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంతగా చొరవ చూపి ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయలేదు. కేసీఆర్ లాంటి వ్యక్తులు దేశ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. అందులో ఉద్యోగవర్గం సంబురం చేసుకోవాల్సిన తరుణం ఇది. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో విజయ తీరాలకు చేర్చిన మన ముఖ్యమంత్రికి దేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలిపే సత్తా కూడా ఉంది.
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 11: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్.. దేశంలోనే ఎవరికీ లేనంతగా మాకు జీతాలు పెంచారు. మాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మేము చేసిన పోరాటానికి ఆయన మాకు తగిన గౌరవం ఇచ్చారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అడుగు పెడితే ఇక దేశం రూపురేఖలు మారుతాయి. ఏదైనా సాధించగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్. మాలో ఉద్యమ స్ఫూర్తి నింపి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న ఆయనకు మేమంతా వెన్నుదన్నుగా నిలుస్తాం. ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. దేశం నలుమూలలా పర్యటించి అధికారం చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాం.
-స్వామి, డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల శాఖ, కామారెడ్డి
పోరాటంతోనే ప్రతిఫలం అని నమ్మిన నాయకుడు కేసీఆర్ సారు. అదే పోరాటం ఆయనను తెలంగాణ సాధించే వరకు తీసుకెళ్లింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం దేశంలోనే ఎక్కడా లేని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి నిరుపేదకూ ప్రభుత్వం అండగా ఉందని తేల్చి చెప్పిన నేత ఆయన. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అడుగు పెడితే మరోసారి తన పోరాట పటిమ ద్వారా మోదీ ప్రభుత్వంపై విజయం సాధించి తీరుతారన్న నమ్మకం మాకున్నది. మన తెలంగాణ నుంచి దేశ రాజకీయాలను శాసించే నాయకుడు రావాలని మేము బలంగా కోరుకుంటున్నాం. తెలంగాణ కోసం ఉద్యోగులు చేసిన పోరాటాన్ని గుర్తించి ప్రత్యేకంగా ప్రతి ఉద్యోగికీ ఇంక్రిమెంటు అందించి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. ఎప్పటికీ కేసీఆర్ వెంటే మా అడుగులు.
-మహిపాల్, అధ్యక్షుడు, టీఎన్జీవోస్ ఎల్లారెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు తక్కువగా ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పెద్దమొత్తంలో జీతాలను పెంచారు. ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమం అనే రెండు అంశాల ఆధారంగా రాష్ట్రం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. ఇది ఓర్వలేకనే కేంద్రం మన రాష్ట్రంపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. వీటిని పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోని రైతులకు ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం లభిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్తు, పంటలకు మద్దతు ధర, బీమా సౌకర్యం వంటి పథకాలు అమలుచేయడంతో మన ముఖ్యమంత్రికి దేశంలోనే రైతు బాంధవుడు అనే పేరు వస్తున్నది.
-శరణ్, ప్రధాన కార్యదర్శి, టీఎన్జీవోస్ , ఎల్లారెడ్డి
అన్ని రంగాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. జాతీయ రాజకీయాల్లో రాణిస్తే దేశాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే సత్తా ఆయనలో ఉంది. ఇప్పటికే తెలంగాణ వైపు ఇతర రాష్ర్టాల నాయకులు తొంగిచూస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ఇదే సరైన సమయం. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే దేశం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగే ఆవకాశం ఉంటుంది.
-రాజు, పంచాయతీ కార్యదర్శి, మద్నూర్ మండలం
ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆరే. దక్షిణాది నుంచి నుంచి దేశ్కా నేతగా కేసీఆర్ మారబోతుండడం శుభ పరిణామం. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి వెళ్లడం ద్వారా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు దేశం మొత్తం అమలయ్యే అవకాశం ఉంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్.
-రాజు, ఐకేపీ సీసీ, పిట్లం మండలం సార్
కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి వెళ్లడం శుభపరిణామం. తెలంగాణ పథకాలు అద్భుతం. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ అందుతాయి. ఫలితంగా అందరూ సంతోషంగా ఉంటారు. కేసీఆర్ అవసరం దేశ ప్రజలకు ఉంది.
రఘుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, కోటగిరి మండలం