మోర్తాడ్, సెప్టెంబర్ 11 : మండలంలోని సుంకెట్, మోర్తాడ్, గాండ్లపేట్, దొన్కల్, పాలెం, ధర్మోరా, శెట్పల్లి గ్రామాలను ఆనుకొని ప్రవహిస్తున్న పెద్దవాగు చెక్ డ్యాముల నిర్మాణంతో కళకళలాడుతున్నది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పట్టువదలకుండా పెద్దవాగులో చెక్‌డ్యాములను నిర్మింపజేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షపునీరు వృథా పోకుండా ఉండడంతోపాటు భూగర్భ జలమట్టం పెరిగిందని, సాగు, తాగునీటికి ఇబ్బందులు దూరమయ్యాయని అంటున్నారు. చెక్‌డ్యాముల నిర్మాణానికి చేసిన కృషికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఈ సందర్భంగా రైతులు, మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మండలంలోని సుంకెట్ శివారులో రూ.9.03కోట్లతో, గాండ్లపేట్ శివారులో రూ.5.50కోట్లు, పాలెం-ధర్మోరా గ్రామాల మధ్య పెద్దవాగులో రూ.8.96కోట్లతో చెక్‌డ్యాముల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చెక్‌డ్యాముల వద్ద దాదాపు కిలో మీటరు మేర నీరు నిలువడంతో భూగర్భజలాలు పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. వేసవిలో ఎండిపోయే బోర్లు భూగర్భ జలమట్టం పెరగడంతో ప్రస్తుతం ఎండిపోవడం లేదని రైతులు, సమీప గ్రామాల ప్రజలు అంటున్నారు. భూగర్భజలాలు పెరగడం కారణంగా సాగు, తాగునీటికి ఢోకాలేదంటున్నారు.
గతంలో దశాబ్దాలపాటు పెద్దవాగును పట్టించుకున్న వారు లేరు. ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేముల ప్రశాంత్‌రెడ్డి.. పెద్దవాగు నీరు వృథా పోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రాష్ట్రప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి పెద్దవాగులో చెక్‌డ్యాముల నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ఎవరూ ఆలోచించని రీతిలో ఆలోచించి చెక్‌డ్యాములను నిర్మింపజేసి వృథాగా పోయే నీటికి అడ్డుకట్ట వేయడమే కాకుండా భూగర్భజలాలు పెరగడంతో సాగు,తాగునీటికి ఢోకా లేకుండా చేశారు.
పెద్దవాగులో చెక్‌డ్యాములు నిర్మించడంతో పంటల సాగుకు ఇబ్బందులు దూరమయ్యాయి. ఇంతకు ముందు నీటి కోసం వాగులోనే బోర్లు వేసుకునేటోళ్లం.. కానీ ఇప్పుడు అటువంటి అవసరం లేదు. ఏండ్లనుంచి ఎవరికి మొరపెట్టుకున్న పట్టించుకోలేదు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి పుణ్యమా అని చెక్‌డ్యాము నిర్మాణం పూర్తయ్యింది. ఆయన రైతులకు చేస్తున్న మేలును మరువలేం.
– శంకర్, రైతు, పాలెం
పెద్దవాగులో చెక్‌డ్యాముల నిర్మాణం రైతుల దశాబ్దాల కల. తమ కల నెరవేరుతుందో.. లేదోనని రైతులు ఎదురు చూశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి కారణంగా రైతుల కల నెరవేరింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంతో పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి చెక్ డ్యాముల నిర్మాణం పూర్తి చేయించారు. గతంలో ఆయకట్టు నిరుపయోగంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మంత్రికి రుణపడి ఉంటాం.
– తాటిపల్లి శ్రీనివాస్, రైతు, దొన్కల్