కోటగిరి సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నది. జిల్లాలో పేదరికం, వలసలు, నిరక్ష్యరాస్యత కారణంగా గర్భిణులు, బాలింతలు తగిన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోలేక రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తూ పిల్లలకు తగిన పోషకాలు అందించకపోవడంతో చాలామంది చిన్నారులు వయసు కు తగిన ఎత్తు, బరువు ఉండడం లేదు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం ఏటా పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోషణ మాసం పేరుతో మాతాశిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ నెల 1 నుంచి 30 వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో పోషణ మాసం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
జాతీయ పోషణ మాసోత్సవాన్ని పురస్కరించుకొని పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ 30 రోజుల పాటు పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలతో వైద్య, ఆరోగ్య శాఖ, డీఆర్డీఏ, విద్యాశాఖను భాగస్వామ్యం చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలవడం, తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించడం, టీకాలు వేయించడం చేస్తారు. అవగాహనా ర్యాలీలు ఇంటింటా పోషణ సంబురాలు చేపడుతున్నారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, శిశువు పుట్టినప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టించడం, ఆరు నెలల వరకు తల్లి పాలు తప్పనిసరిగా ఇచ్చేలా అవగాహన కల్పించడం, ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం , గర్భిణులు, బాలింతలు పోషకాల కోసం ఆకుకూరలు, తృణధాన్యాలు విధిగా తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఒక్కో చి న్నారికి రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 0.5 గ్రాముల నూనె, 50 గ్రాముల గుడ్డు, 20 గ్రాముల మురుకులు, 50 గ్రాముల బాలామృతం అందజేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు సైతం ప్రత్యేక ఆహారం ఇవ్వడంతో పాటు బరువు, ఎత్తు కొలతలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ లోపం గుర్తించేందుకు మొదట పిల్లల బరువును తూకం వేయాలి. ముందుగానే కేంద్రాల్లో బరువు తూచే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. సాల్టర్ స్కేల్(బరువు తూచే యంత్రం) ఇన్ఫాంటో మీటర్ (శిశువుల పొడవును కొలిచే యంత్రం), స్టాడియో మీటర్(పిల్లల ఎత్తు కొలిచే యంత్రం) కిశోర బాలికలు, గర్భిణుల బరువు తూచే పరికరాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల పెరుగుదల మెరుగువుతుంది. ఈ క్రమంలో మంచి ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. పిల్లల జబ్బ చుట్టు కొలత చూడడం ద్వారా పోషణ లోపాన్ని గుర్తించవచ్చు. 12.5 సెంటీమీటర్లు ఆపైన జబ్బ చుట్టుకొలత ఉన్నట్లయితే పోషణ లోపం లేనట్లుగా గుర్తించాలి. 12.4 సెంటీమీటర్ల నుంచి 11.5 సెంటీమీటర్లు చుటు ్టకొలత ఉన్నట్లయితే కొద్దిగా పోషణ లోపం ఉన్నట్లు గుర్తించాలి. 11.5 సెంటీమీటర్ల కన్నా తక్కువ చుట్టు కొలత ఉన్నట్లయితే తీవ్ర పోషణ లోపం ఉన్నట్లు గుర్తించాలి.
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల ఒకటో తేదీ నుంచి పోషణ మాసోత్సవం నిర్వహిస్తున్నాం. పోషకాల లోపం ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు వారానికి ఒక సారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంట్లో ఉన్న సరుకులతో పోషక విలువలున్న తినుబండారాలు ఎలా తయారు చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాం.
– సౌందర్య, మాతా శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి అధికారిణి