నిజామాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);సంకుచిత, విద్వేష రాజకీయాలతో దేశ సర్వతోముఖాభివృద్ధి కుంటుపడుతున్నది. బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో సామాన్య ప్రజానీకం చిక్కి విలవిల్లాడుతున్నది. ప్రజా సంక్షేమం పట్టని కేంద్ర సర్కారు తీరుతో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. బలమైన ప్రతిపక్షం లేకుండా పోయిన తరుణంలో మోదీ సర్కారు ఆడిందే ఆటగా మారింది. రాజకీయ శూన్యత భారతావనికి పెను ప్రమాదంగా మారిన తరుణంలో దేశ ప్రజానీకానికి ‘చంద్రశేఖరుడి’ రూపంలో కొత్త ఆశాకిరణం కనిపిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెగించి కొట్లాడుతున్న, అడుగడుగునా నిలదీస్తున్న సీఎం కేసీఆర్ పేరే నలుదిక్కులా ప్రతిధ్వనిస్తున్నది. తీవ్ర సంక్షోభం వైపు నెట్టివేయబడుతున్న జాతిని జాగృతం చేసేందుకు జాతీయ రాజకీయ యవనికపై తెలంగాణ ఉద్యమ నేత మహోజ్వలంగా ప్రభవించాలని యావత్ దేశం కోరుకుంటున్నది. ప్రపంచాన భారతావనిని ప్రథమ స్థానంలో నిలపడానికి, జాతి ప్రయోజనాల కోసం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి బయల్దేరాలని బలంగా ఆకాంక్షిస్తున్నది. కార్మికులు, కర్షకులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఒకరేమిటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సబ్బండవర్ణాలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాయి. అలుపెరుగని ఉద్యమాలతో సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన కేసీఆర్.. అదే ఉద్యమస్ఫూర్తితో దేశ గతిని సైతం మార్చడానికి జాతీయ రాజకీయాల్లోకి అడుగిడాలని ఆహ్వానిస్తున్నాయి. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాయి.
గడిచిన ఆరు నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కన్నేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతూ రైతులు, సామాన్య ప్రజల ఉసురు తీస్తున్న తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. నేరుగా కేంద్రంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఢీ కొడుతూ జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిని కేసీఆర్ చాటుకుంటున్నారు. ఇటీవల దేశ రాజకీయాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఇలా అడుగు వేశారో లేదో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వణుకు పుట్టింది. దెబ్బకు దేశంలో ఇంధన ధరలు మే నెలలో తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో అసలేం జరుగుతున్నదని ఎవరైనా అడిగితే బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని నిక్కచ్చిగా చెబుతున్నారు. ప్రధానిగా మోదీ చేయలేని ఎన్నో పనులను సీఎంగా కేసీఆర్ తెలంగాణలో చేసి చూపించారు. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రజా వ్యతిరేక బీజేపీ సర్కారును కేంద్రంలో కూలదోసి బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో సాగుతున్న తెలంగాణ సాధకుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఉమ్మడి నిజామాబాద్ ప్రజల నుంచి అన్ని రంగాల వ్యక్తులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితో…
అరవై ఏండ్ల తెలంగాణ రాష్ట్ర సాధనను కేసీఆర్ ఒక్కడై మొదలైన ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి ప్రాణాలను పణంగా పెట్టి సాధించారు. అనేక రాజకీయ వ్యూహాలు, ఉద్యమాలు చేసి నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. యావత్ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఇతర రాష్ర్టాల్లోని అనేక రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. రాదు అనుకున్న తెలంగాణను సాకారం చేసిన వ్యక్తిగా ఘనమైన కీర్తిని సంపాదించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడేకంగా కుటిల శక్తుల నుంచి దేశాన్ని కాపాడేందుకు బయల్దేరుతున్నారు. బీజేపీ కబంధ హస్తాల్లో బందీ అవుతున్న భరతమాతకు స్వేచ్ఛాగీతికను ప్రసాదించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో యావత్ దేశ ప్రజలను, రాజకీయ శక్తిని ఏకతాటిపైకి తీసుకువచ్చి నిరంకుశ మోదీ ప్రభుత్వానికి ఎన్నికల్లో చరమగీతం పాడేలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో ప్రాంతీయ పార్టీల మద్దతుతో బరిగీసి కొట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 5న నిజామాబాద్ నగరంలో జరిగిన సభలోనూ లక్షలాది మంది జనాల సాక్షిగా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా కేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా నాన్ బీజేపీ ప్రభుత్వంలో దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ అందిస్తామని చేసిన ప్రకటన జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ప్రత్యామ్నాయ అజెండా..
దేశం కోసం ఎంతవరకైనా కొట్లాడుతానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల ఢిల్లీలో అడుగుపెట్టారు. వ్యవసాయ నల్లచట్టాలపై నిరసన తెలుపుతూ కేంద్రంలోని బీజేపీతో శాంతియుతంగా పోరాడుతూ మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. ఇటు భారత్ – చైనా సరిహద్దులో జరిగిన గల్వాన్ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం నేరుగా అందజేశారు. అలాగే దేశవ్యాప్త నాయకులను కలుపుకొని ప్రత్యామ్నాయ అజెండా రూపకల్పనకు కేసీఆర్ ముందుకు కదులుతుంటే బీజేపీకి మింగుడు పడడం లేదు. అందుకే కేంద్రంలోని బీజేపీ నాయకులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలుతున్నారు. మొన్నటికి మొన్న సెప్టెంబర్ 1నుంచి వరుసగా మూడు రోజుల పాటు లోక్‌సభ ప్రవాస్ యోజన పేరిట కేంద్ర ఆర్థిక మంత్రి ఉమ్మడి జిల్లాలో పర్యటించి విషం చిమ్మింది. రూపాయి సాయం చేయకున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించి అపకీర్తిని మూటకట్టుకున్నది. తన నోటి దురుసుతనంతో నిర్మలా సీతారామన్ పరువు తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ను నిలువరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా గమనిస్తున్నారు.
కేసీఆర్‌తోనే గుణాత్మక మార్పు..
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అనేక మంది మేధావులు, జాతీయ నాయకులు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి క్యూ కడుతుండడంతో కేంద్ర ప్రభుత్వానికి గుబులు పడుతున్నది. కేసీఆర్ మరో సంచలనం సృష్టించబోతున్నారనే విషయం బీజేపీకి అవగతమైంది. జాతీయస్థాయిలో సీఎం కేసీఆర్ పర్యటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతున్నది. కేసీఆర్ ఏం చేయబోతున్నారంటూ జాతీయస్థాయిలో ఒకటే చర్చ జరుగుతున్నది. కేసీఆర్ రైతు పక్షపాతి, రైతు బాగుండాలని, గొప్పగా ఉండాలని తపించే నాయకుడు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు మాత్రం రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి. దేశ ప్రజలు నిజనిజాలు గ్రహిస్తున్నారు. దేశభక్తి, మతం పేరిట ప్రజల భావోద్వేగాలతో బీజేపీ రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నదని ప్రజలు ఇప్పటికే గమనించారు. తెలంగాణ సాధించిన ప్రగతి మాదిరిగానే దేశం సుభిక్షంగా వర్ధిల్లేందుకు, దేశాభివృద్ధిని సమ్మిళితంగా సాధించేందుకు కేసీఆర్ అడుగులో అడుగై ఉద్యమ తరగంలా మనమంతా ఆయన వెంట నడవాల్సిన సమయం ఆసన్నమైందంటూ ప్రజలు సైతం జై కేసీఆర్… జయహో కేసీఆర్ అంటూ నినదిస్తున్నారు.
కేసీఆర్ అసొంటి లీడర్ దేశానికి కావాలి..
హరిత తెలంగాణనే కాదు… హరిత భారత్ కావాల్నంటే దేశానికి కేసీఆర్ అసొంటి లీడర్ కావాలి. తెలంగాణ అచ్చినంక ఎవుసానికి కిస్మత్ ఖులాయించింది. మునుపు ఎవుసాన్నీ.. రైతుల్నీ.. పట్టించుకునేటోళ్లు కాదు. పంటలు సక్కగ పండక, అప్పులై మస్తుమంది రైతులు సచ్చిపోతుండ్రి. తెలంగాణ అచ్చి.. కేసీఆర్ సీఎం అయినంక ఎవుసం పొజిషన్ మా రింది. పుక్యం 24 గంటల కరెంట్ ఇచ్చుట్ల రైతుల్ల ధైర్నం అచ్చింది. నాకు ఎల్లారెడ్డిల నాలుగెకరాల భూమి ఉన్నది. ఏండ్ల సంది ఎప్పుడు గూడా నాలుగెకరాలు ఎవుసం చేయకుంటిమి, కేసీఆర్ పథకాలు పెట్టుట్ల ఆరేడు ఏండ్ల సంది నాలుగెకరాల్లో పంట పండిస్తున్నం. మరి ఇసొంటి నాయకుడు తెలంగాణల్నే ఉంటే ఎంత మారిపోయిందో…మరి దేశం గూడా అట్ల కావాల్నంటే.. కేసీఆర్ అసొంటి నాయకుడు ప్రధాని అయితేనే సాధ్యమైతది.
– పోతుల ప్రకాశ్, యువరైతు, ఎల్లారెడ్డి
దేశం అభివృద్ధి పథంలో నడుస్తది..
వర్ని, సెప్టెంబర్ 10: కేసీఆర్ జాతీయ రాజకీ యా ల్లో అడుగుపెడితే దేశం అభి వృద్ధిపథంలో నడుస్తది. పేదో ళ్లను ఆదుకునేందుకు పింఛ న్లు ఎలా ఇస్తున్నారో.. అలాగే దేశమంతా ఇస్తే నిరుపేదలే ఉండరు. పెద్దోళ్లకు దోచిపెట్టే కొన్ని డబ్బులు నిరుపేదలకు ఖర్చు పెడితే ఏం పోతదు. నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా కేసీఆర్‌కు ఉన్నది.
– కమ్మరి గంగాధర్, రిటైర్డ్ ఉద్యోగి, జాకోర