నస్రుల్లాబాద్ (బీర్కూర్), సెప్టెంబర్ 10: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో సాయిరాజ్ (10) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులుతెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బీసీ హాస్టల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో సాయిరాజ్‌కు వాంతులు కావడంతో వాచ్‌మన్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చూపించుకొని వచ్చాడు. ఉదయం సాయిరాజ్ నిద్ర నుంచి లేవకపోవడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపు సాయిరాజ్ మృతి చెంది ఉన్నాడు. రాత్రివేళ హాస్టల్‌కు పాము వచ్చిందని, దానిని చంపి బయటపడేశామని విద్యార్థులు తెలిపారు. పాముకాటుతో మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, గ్రామస్తులు హాస్టల్‌కు చేరుకొని బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు.
పీహెచ్‌సీకి వచ్చిన సాయిరాజ్ తనకు పాము కాటువేయలేదని చెప్పాడని, దీంతో ఎలాంటి చికిత్స చేయలేదని స్టాఫ్ నర్సు వినోద తెలిపారు. బాన్సువాడ దవాఖానకు రిఫర్ చేయగా వెళ్లాడానికి నిరాకరించారని చెప్పారు.
బీసీ వసతిగృహం వార్డెన్ సందీప్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. వార్డెన్ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందాడని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామని తెలిపారు. సాయిరాజ్ మృతి విషయం తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు,అధికారులతో ఫోన్లో మాట్లాడి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.