మాచారెడ్డి, సెప్టెంబర్ 10 : మండలంలోని గజ్యానాయక్‌తండా, ఎక్స్‌రోడ్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం జూన్ 20న కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశారు. అనంతరం మూడు నెలల్లో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
విద్యుత్ సమస్యల నుంచి విముక్తి
గతంలో ఉమ్మడి మాచారెడ్డి జీపీలో అనుబంధంగా ఉన్న గజ్యానాయక్‌తండా, ఎక్స్‌రోడ్ గ్రామానికి నిత్యం విద్యుత్ సమస్య ఉండేది. గజ్యానాయ్తండా గ్రామం వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ దశలో లోవోల్టేజీ సమస్య ఎక్కువై మాచారెడ్డి, చుక్కాపూర్, కొత్తపల్లి, గజ్యానాయక్తండాకు కలిపి ఒకే విద్యుత్ సబ్‌స్టేషన్ ఉండగా వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ ఎల్సీ తీసుకున్నా నాలుగు గ్రామాల్లో కరెంట్ కట్ అయ్యేది. ఈ సమస్యను ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో పలు మార్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ భవనం ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లాగా వెంటనే మంజూరు చేస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. వేగంగా పనులు పూర్తి చేశారు.
ప్రభుత్వ విప్ కృషితో సబ్‌స్టేషన్
గ్రామంలో నిత్యం విద్యుత్ సమస్య ఉండేది. ఇప్పటికే రెండు కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. గ్రామానికి మంజూరైన సబ్‌స్టేషన్ పనులు పూర్తయ్యాయి. ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌నకు విన్నవించగా ఆయన కృషితో సబ్‌స్టేషన్ మంజూరైంది. దసరాలోగా ప్రభుత్వ విప్ చేతుల మీదుగా సబ్ స్టేషన్‌ను ప్రారంభిస్తాం. సబ్‌స్టేషన్ మం జూరు చేసినందుకుగాను సీఎం కేసీఆర్‌కు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– హంజీనాయక్, సర్పంచ్, గజ్యానాయక్‌తండా