నిజామాబాద్ క్రైం సెప్టెంబర్ 8: నిజామాబాద్ నగరంలో శుక్రవారం జరుగనున్న గణేశ్ శోభాయాత్రకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట నిఘా పెట్టనుంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా బలగాలను మోహరిస్తున్నది. సీపీ నాగరాజు నేతృత్వంలో నగరంతో పాటు నవీపేట మండల పరిధిలోని యంచ వద్ద గల గోదావరి వరకు 530 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. శోభాయాత్ర నిర్వహించే అన్ని ప్రధాన ఏరియాలతో పాటు ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక పికెట్ పెడుతున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, శోభాయాత్ర పూర్తయ్యే వరకూ రికార్డింగ్ చేయనున్నారు. ఈ సీసీ కెమెరాల రికార్డింగ్‌తో పాటు పుటేజ్‌ను కమిషనరేట్‌లో గల కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు.
శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో రాకపోకలను మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్లే వారు, బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్లే వారు బైపాస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. శోభాయాత్రలో పాల్గొనే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తామని, ఎవరైనా మద్యం తాగినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, పటాకులు కాల్పడంపైనా నిషేధం విధించినట్లు సీపీ నాగరాజు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు, బార్లు, కల్లు బట్టీలు, డిపోలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు బంద్ ఉంటాయని సీపీ తెలిపారు.
ఇందూరు, సెప్టెంబర్ 8 : సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. రజాకార్లను ఎదురించేందుకు ప్రజలందరినీ సంఘటితం చేసేందుకు 1944లో ఏర్పాటు చేసి బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సార్వజనిక్ గణేశ్ మండలిగా ఏర్పాటు చేశారు. అప్పటి నిరంతరాయంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రథాన్ని లాగేందుకు 100 ఎడ్ల జతలను ఉపయోగించే వారు. రానురాను తగ్గిపోయి ప్రస్తుతం 15 ఎడ్ల జతలతో రథాన్ని లాగుతున్నారు. 1975లో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వారి సహకారంతో రథాన్ని తయారు చేయించారు. 2014 వరకు ఉపయోగించి ఆ రథం స్థానంలో 2015 లో కొత్త రథాన్ని సర్వసమాజ్ వారు తయారు చేయించారు. ప్రస్తుత ఉత్సవాల కోసం కొత్తగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరో రథాన్ని సైతం తయారు చేయించారు. ఇందులో 3 ఫీట్ల గణేశులు, మరో రథంలో 3 నుంచి 5 ఫీట్ల వరకు ఉన్న గణనాథుల విగ్రహాలను ఉంచనున్నారు.
సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో రైల్వేట్రాక్ పక్కన గణేశ్ ఆలయాన్ని 11 మంది సభ్యుల సహకారంతో 1984 నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి నిత్యం గణనాథుడు పూజలందుకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలు వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమై రాత్రి 11.30 వరకు కొనసాగుతుంది. శోభాయాత్రను సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్ జెండా ఊపి ప్రారంభిస్తారు.
దుబ్బ చౌరస్తా, కెనాల్ కట్ట, గాంధీచౌక్, పవన్ థియేటర్, గురుద్వారా, లక్ష్మీ మెడికల్, ఆర్యసమాజ్, గోల్‌హన్మాన్, పాటిగల్లీ, పూలాంగ్ చౌరస్తా మీదుగా మీదుగా వినాయకుల బావి వద్దకు రథయాత్ర చేరుకుని గణపతుల బావి వద్ద నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్, కార్యదర్శి శివకుమార్ పవార్, కోశాధికారి పోతులూరి శ్రీనివాస్, సభ్యుడు బంటు బాలవర్తి తెలిపారు.
గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. ఈసారి శోభాయాత్రలో రెండు రథాలు ఉంటాయి. 3 ఫీట్ల వరకు ఒకటి, 3 నుంచి 5 ఫీట్లు మరో రథంలో ఉంచేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు నీటి వసతి, అల్పాహారం, మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాం. దాతలు కూడా ఎవరైనా పంపిణీ చేయవచ్చు.
-బంటు గణేశ్, సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు
శోభాయాత్రలో పాల్గొనే భక్తులు, గణేశ్ మండపాల నిర్వాహకులు సంయమనం పాటించి ఒకే దగ్గర గుమిగూడకుండా రథానికి ముందు వెనుక జాగ్రత్తగా ఉండాలి. గణేశులను రథంలో ఉంచిన తర్వాత అందరూ కూడా రథానికి ముందు భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. గురువారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. రూట్‌మ్యాప్‌లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-శివకుమార్ పవార్, కార్యదర్శి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వినాయక శోభాయాత్ర కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను గురువారం విడుదల చేసిన అధికారులు.. నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. 270 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయా విగ్రహాలను కామారెడ్డి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర సాగే మార్గంలో పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, టీఆర్ఎస్ నేత నిట్టు వేణుగోపాల్‌రావు అధికారులతో కలిసి పరిశీలించారు.
నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 8 : నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించే గణేశ్ విగ్రహ నిమజ్జన శోభాయాత్రలో మార్పులు చేసినట్లు పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు తెలిపారు. అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సార్వజనిక్ గణేశ్ మండలి, ఇతర పెద్దలతో చర్చించిన తర్వాత మార్పు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్‌లో సార్వజనిక్ మండలి బాధ్యులతో కలిసి గురువారం నిర్వహించిన సమావేశంలో సీపీ బాసర గోదావరి నదిలో నిమజ్జన కోసం తరలి వెళ్లే గణపతి విగ్రహాల శోభాయాత్ర తాము సూచించిన మార్గంలో నిర్వహించాలని కోరారు. జాన్కంపేట్‌లో బ్రాడ్‌గేజ్ రైలు హైటెన్షన్ రైల్వే లైన్‌గా మార్పు చేయడంతో బాసరకు నిమజ్జనం కోసం 8 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు ఈ రూట్లో నిషేధించినట్లు తెలిపారు. 8 ఫీట్ల లోపు గల విగ్రహాలను పాత రూటు ప్రకారం జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట్ మీదుగా బాసరకు తీసుకెళ్లవచ్చని తెలిపారు. 8 ఫీట్ల కన్నా ఎత్తుఉన్న విగ్రహాల రూటును మార్చినట్లు తెలిపారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందినవారు గాజుల పేట్, శివాజీ నగర్, గోల్‌హన్మాన్, అంగడి బజార్, ఎల్లమ్మగుట్ట, పూలాంగ్ చౌరస్తా, రాజరాజేంద్ర చుట్టు ప్రాంతాలు, సాయినగర్, గాయత్రీ నగర్, కోటగల్లీ, హౌసింగ్ బోర్డు, బోర్గాం, న్యాల్కల్, నాగారం మొదలగు కాలనీల వారు పూలాంగ్, ధర్నా చౌక్, రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, దుబ్బ, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, తెలంగాణ చౌక్, ముబారక్ నగర్, మానిక్‌బండార్, దాస్ నగర్, మాక్లూర్, నందిపేట్, నవీపేట్ మీదుగా బాసర గోదావరి నదికి నిమజ్జన కోసం తరలివెళ్లాల్సి ఉంటుందని సీపీ సూచించారు.