బాన్సువాడ, సెప్టెంబర్ 8 : ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చేపల పంపిణీ, విక్రయాల్లో దళారీ వ్యవస్థను అంతమొందించాలన్నారు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అంతకుముందు చెరువులో విడుదల చేసేందుకు తెచ్చిన చేప పిల్లలను పరిశీలించారు. స్కేల్ ద్వారా కొలతలు తీయగా.. సైజ్ కేవలం 60 నుంచి 70 మిల్లి మీటర్లు ఉండడంతో మత్స్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులు, మత్స్యశాఖ కమిషనర్‌కు సూచనలు చేశానని, అయినప్పటికీ చిన్న చేప పిల్లలనే తీసుకురావడంలో ఆంతర్యమేంటని మండిపడ్డారు.
తన నియోజకవర్గానికి చిన్న చేప పిల్లలను తెస్తే వాపస్ తీసుకెళ్లాలని సూచించారు. తానే స్వయంగా ప్రతి చెరువులో చేప పిల్లలను విడుదల చేస్తానని స్పష్టం చేశారు. 80 మి.మీ నుంచి 100 మిల్లీ మీటర్ల సైజ్ తో కలిగిన చేప పిల్లలు మాత్రమే ఉం డాలన్నారు. సీజనల్ చేపలను తెచ్చి చెరువుల్లో వేయరాదని చెప్పినా, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని మండి పడ్డారు. అనంతరం పెద్ద సైజ్‌లో ఉన్న బొచ్చ చేప పిల్లలను కలెక్టర్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభాపతి పోచారం మాట్లాడారు. రైతులు మంచి పంట పండించడానికి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేస్తారని, అలాగే మంచి సైజ్ ఉన్న చేప పిల్లలను చెరువులో విడుదల చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. రైతులు పండించేది చెరువు కింద పంట అని, మత్స్యకారులు పండించేది చెరువులో పంట అని తెలిపారు. ప్రస్తుతం చేప పిల్ల ధర రూపాయి ఉందని, ఏడాదిలోపు కిలో పెరిగితే వంద రూపాయలు వస్తాయన్నారు.
కుల వృత్తుల వారు స్వగ్రామంలోనే ఉపాధి పొంది గౌరవంగా బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చిన ప్రతి చేప పిల్లను మత్స్య సహకార సంఘ సభ్యులు లెక్కించాలని సూచించారు. అనంతరం సభాపతిని మత్స్య కార్మిక సంఘ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో రాజాగౌడ్ , రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.