కోటగిరి/వర్ని, సెప్టెంబర్ 8: సబ్బండ వర్ణాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గురువారం ఆయన కోటగిరి, వర్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటగిరిలో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు కార్డులను అందజేయగా, వర్ని మండల కేంద్రంలో వర్ని, చందూరు, రుద్రూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం స్పీకర్ మాట్లాడారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పింఛన్ రూ.600 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అక్కడ కేవలం 12 లక్షల మందికి మాత్రమే ఇస్తుంటే మన రాష్ట్రంలో 45 లక్షల మందికిపైగా ఇస్తున్నట్లు చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో 36 వేల మందికి పింఛన్లు వస్తుండగా, కొత్తగా మరో 10 వేల మందికి మంజూరైనట్లు తెలిపారు. నిరుపేదలను ఆదుకోవడంలో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. ఎనిమిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని అన్నారు. మైక్ దొరికితే చాలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని స్పీకర్ సూచించారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని వీఆర్ఏలు, కారోబార్లు కోరా రు. ఈ మేరకు వారు స్పీకర్‌ను కలిసి వినతి పత్రాలను అందజేశారు. కోటగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ వల్లేపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్‌పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్‌పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తేళ్ల లావణ్య, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్ధు, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, మండల కో-ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, వర్నిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీలు మేక శ్రీలక్ష్మి, అక్కపల్లి సుజాతా నాగేందర్, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, నారోజీ గంగారాం, వైస్ ఎంపీపీలు దండ్ల బాలరాజు, నట్కరి సాయిలు, కో -ఆప్షన్ సభ్యుడు కరీం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కల్లాలి గిరి, పత్తి లక్ష్మణ్, సర్పంచులు పాల్గొన్నారు.