ఇందూరు, సెప్టెంబర్ 8 : జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు సాధించేలా ప్రతి గ్రామ సచివాలయం కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. న్యూకలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తొమ్మిది అంశాలను ప్రామాణికంగా పరిగణిస్తూ భారత ప్రభుత్వం జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేస్తుందని, సంబంధిత అంశాల్లో ప్రగతిని మరింతగా మెరుగుపర్చుకోవాలని అన్నారు. శుక్రవారం నిర్వహించే వినాయక నిమజ్జనోత్సవం సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్
నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాసర మార్గంలో జాన్కంపేట్ వద్ద అవెన్యూ ప్లాంటేషన్‌ను చక్కదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, మినీ బృహత్ పల్లెప్రకృతి వనాలకు ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు కమిషనర్ నాగరాజుతో కలిసి వివిధశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వజ్రోత్సవ వేడుకలు, వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు విద్యాసంస్థలు, ఇతర ప్రముఖ వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ సంస్థల సముదాయాలను మూడు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించేలా చూడాలన్నారు.
16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కనీసం 15 వేల మందికి తగ్గకుండా, జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ సంబంధిత శాసనసభ్యుల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ర్యాలీ అనంతరం భోజన వసతి కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ, ప్రతి మున్సిపల్ వార్డు నుంచి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులే ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసుశాఖ క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.
17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. గిరిజన తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన 1300 మందిని హైదరాబాద్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలించాలని అల్పాహారం, భోజన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని, స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ తదితర కళాశాల స్థాయి విద్యార్థులను మాత్రమే భాగస్వాములు చేయాలలని సూచించారు.
నిమజ్జనోత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జనోత్సవం చేసే ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని, వారితోనే విగ్రహాలను నిమజ్జనం చేయించాలని ఆదేశించారు. నిర్ణీత మార్గాల మీదుగా నిమజ్జన శోభాయాత్ర కొనసాగేలా ప్రణాళికలు రూపొందించుకుని పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, డీసీవో సింహాచలం, అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.