నిజామాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచితంగా చేపపిల్లలను వదిలే కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో నేడో, రేపో ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 5న లాంఛనంగా ప్రారంభించగా, చాలాచోట్ల ముమ్మరం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ పర్యటన, అసెంబ్లీ సమావేశాల కారణంగా కొంత జాప్యం ఏర్పడింది. కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ కొనసాగుతుంది. మత్స్యశాఖ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఈసారి పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. 2022-23 సంవత్సరానికి నిజామాబాద్ జిల్లాలో 1043 జలాశయాల్లో 4కోట్ల 85లక్షల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 627 చెరువుల్లో 2కోట్ల 70లక్షల చేప విత్తనాలను సిద్ధం చేశారు.
పైసా పెట్టుబడి లేకుండా..
ఉభయ జిల్లాల్లోని రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకానికి ఏటా సన్నాహాలు చేస్తున్నారు. మత్స్యకారుల నుంచి రూపాయి కూడా తీసుకోకుండానే ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేప విత్తనాలను సరఫరా చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా చెరువులు, కుంటలు, భారీ ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించారు. 100 శాతం రాయితీతో చేప విత్తనాన్ని అందిస్తూ వారికి కొండంత భరోసాగా ఉంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ అండ లభిస్తున్నది. చెరువులను పునరుద్ధరించడంతో అటు వ్యవసాయానికి సాగునీటి అవసరాలు తీరడంతోపాటు మత్స్య సంపద వృద్ధి సాధ్యమైంది. 2022 వానకాలం ప్రారంభం నుంచి దంచి కొట్టిన వర్షాలతో చెరువులన్నీ జలకళను సంతరించుకోగా, చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేసింది. వేలాది చెరువులు, కుంటలు ఇప్పుడు నిండుకుండల్లా మారడంతో మత్స్య సంపదను పెంచుకునేందుకు మెరుగైన అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వమే ఉచితంగా చేప విత్తనాన్ని నేరుగా చెరువుల్లో వదులుతుండడంతో వచ్చే ఆదాయాన్ని ఆయా గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకే దక్కనుంది.
అక్రమాలకు తావు లేకుండా..
ఏటా చేప విత్తనం సరఫరా చేసే కాంట్రాక్టర్లతో మత్స్య శాఖ అధికారులు కుమ్మక్కు కావడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జలాశయాల్లో హడావిడిగా చేప పిల్లలను వదలడం ద్వారా లెక్కాపత్రం ఉండడం లేదు. అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. చేప పిల్లల సైజుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇచ్చింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ బాధ్యుల సమక్షంలో చేప పిల్లల సైజు, నాణ్యతను నిర్ధారించిన తర్వాతనే చెరువుల్లో వదిలేలా మత్స్య సూచనలు చేసింది. దీంతో కాంట్రాక్టర్ల ఆగడాలకు కల్లెం పడనుంది. మత్స్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్లు ఇష్టారీతిన డ్రమ్ముల్లో చేప పిల్లలను తీసుకువచ్చి ఎవరికీ చూపించకుండానే చెరువుల్లో గుమ్మరించేవారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మత్స్య సహకార సొసైటీల సమక్షంలోనే నిబంధనల మేరకు చేప పిల్లలను విడుదల చేయనుండడంతో ఈ కార్యక్రమం పారదర్శకంగా కొనసాగనుంది.
నిజామాబాద్‌లో 4.85కోట్లు, కామారెడ్డిలో 2.70కోట్ల చేప పిల్లలు..
నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 1043 చెరువుల్లో 4కోట్ల 85 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 249 మత్య్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా, ఇందులో మొత్తం 16,826 మంది సభ్యులుగా ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 627 చెరువులను ఎంపిక చేశారు. వీటిలో 2కోట్ల 70లక్షల చేప పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 147 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 13,170 మంది సభ్యులున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1670 జలాశయాల్లో 7కోట్ల 55 లక్షల చేప పిల్లలు వదలనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలోని చెరువుల్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం కొనసాగనుంది.
రెండు రోజుల్లో చేప పిల్లలను వదులుతాం…
చేప విత్తనాలను పంపిణీ చేసేందుకు నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రెండు రోజుల్లోనే చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈసారి విత్తనాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. కాంట్రాక్టర్లు చేప పిల్లల నాణ్యతలో నిబంధనలు పాటించకపోతే నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలి.
– రాజనర్సయ్య, మత్స్య శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా