బోడ కాకర అటవీ ప్రాంతాల్లో సహజంగా దొరికేవి. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్- జూలై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లభిస్తుంటాయి. మార్కెట్లో బోడ కాకరకాయకు మంచి గిరాకీ ఉంటుంది. కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ధర పలుకుతుంది. వీటిని పండించడం ద్వారా బోలెడు లాభాలను అందుకోవచ్చు.
ముప్కాల్, సెప్టెంబర్ 7: సంప్రదాయ పంటలైన వరి, మక్కజొన్న, టమాట, వంకాయకు భిన్నంగా ఆలోచించాడు ఆ రైతు. తనకున్న భూమిలో కొద్దిభాగం బోడ కాకర సాగు చేస్తూ సత్ఫలితాలు పొంది నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. నాలుగేండ్ల క్రితం యూట్యూబ్‌లో విడుదలైన ఓ వీడియో చూసిన ఆయన బోడ కాకర సాగుపై ఆసక్తి కనబర్చాడు. తన ఆలోచనను తోటి రైతులకు చెబితే అసాధ్యమని చెప్పడంతో కొంతమేర నైరాశ్యానికి లోనయ్యాడు. అయినా పట్టు వదలకుండా సాగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రైతు జంగం భూమన్న.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకు చెంది న ఓ రైతు వద్ద జంగం భూమన్న బోడ కాకర విత్తనాలు కొనుగోలు చేశాడు. మొదటి ప్రయత్నంగా అర ఎకరంలో విత్తనాలు వేయగా మంచి దిగుబడి వచ్చింది. దీంతో నాడు అసాధ్యమన్న రైతులు.. నేడు దిగుబడిని చూసి నివ్వెర పోతున్నారు. నాలు గు రోజులకు ఒకసారి కోస్తే దాదాపు క్వింటాలు దిగుబడి వస్తుందని చెబుతున్నాడు భూమన్న. అర ఎకరానికి 2కిలోల విత్తనాలు అవసరం కాగా, అరవై రోజుల్లో పంట చేతికి వస్తుంది. నాలుగు నెలల పాటు పంటను కోసే అవకాశం ఉంటుంది. బోడ కాకర సాగులో చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభా లు ఆర్జించే అవకాశం ఉన్నది.
సాగు విధానం
సేంద్రియ ఎరువులు : ఆఖరి దుక్కిలో అర ఎకరంలో సేంద్రియ ఎరువుగా మూడు టిప్పర్లు నల్లమట్టి, ఒక లారీ పెంట, ఇరవై బస్తాల వర్మీ కంపోస్టు, ఒక బస్తా 20-20 వేయాలి.
బెడ్ మేకింగ్ : భూమిని చదును చేసిన తర్వాత ట్రాక్టర్ సహాయంతో బెడ్ని రెండు పాయలు మీటర్ ఎడం వచ్చేలా నిర్మించుకోవాలి. ఈ నిర్మాణంతో కాత పైకి ఎగబాకి కిందికి వంగి మొక్క చెడిపోకుండా ఉంటుంది.
డ్రిప్: బెడ్ పైన మొక్కను నాటే చోట డ్రిప్‌ను అమర్చుకోవాలి. డ్రిప్ ద్వారా మొక్కకు కావాల్సినంత నీటిని అందించేందుకు వీలవుతుంది. డ్రిప్ ద్వారా నీటినే కాకుండా పంటకు కావాల్సిన ఎరువులు అందించే వీలున్నది. నీటి వృథాను అరికట్టవచ్చు.
మల్చింగ్ : పాలిథిన్ కవర్‌తో బెడ్ చుట్టూ పరిచి చివరకు మట్టితో కప్పి ఉంచాలి. మల్చింగ్‌తో కలుపు మొక్కలు పెరిగే అవకాశం తక్కువ. దీంతో గడ్డి మందులు పిచికారీ చేయాల్సిన అవస రం ఉండదు. ఖర్చు కూడా తగ్గుతుంది. భూమిలోని నీరు ఆవిరి కాకుండా చేస్తుంది. ఎక్కువ వర్షాలు కురిస్తే నీరు నిల్వ ఉండకుండా చూస్తుంది.
కట్టెలు : వెదురు బొంగులను తీసుకువచ్చి పందిరిలా అమర్చుకోవాలి. పందిరి వేయడంతో మొక్క ఎగబాకి ఊతంలా పనికొస్తుంది.
ప్లాస్టిక్ నెట్ : వైర్‌ను కట్టెలకు కట్టి ప్లాస్టిక్ నెట్ సహాయంతో పందిరిలా అల్లుకోవాలి. గాలి వెలుతురు తగిలి మొక్క ఎదిగి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. క్రాఫ్టింగ్కు అనువుగా ఉంటుంది.
వినూత్నంగా పండించాలనే కోరిక నెరవేరింది..
నాకున్న కొద్దిపాటి భూ మిలో బోడకాకర వేశాను. అది మన వాతావరణంలో ఇముడుతుందని ప్రయత్నించాను. నా శ్రమకు గుర్తింపు లభించింది. కాకర సాగు ఎంచుకోవడానికి ముఖ్యకారణం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం. చీడ, పీడల బెడద చాలా తక్కువ. నాలుగేండ్ల కింద యూట్యూబ్‌లో చూసి పంట సాగు చేశాను. ఎవరికైనా బోడకాకర విత్తనాలు కావాలన్నా, సాగులో సలహాలు, సూచనల కోసం సంప్రదించవచ్చు.
– జంగం భూమన్న, రైతు (9912114232)
ప్రభుత్వ సహకారం ఉంటుంది..
జనాభా అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో కూరగాయల సాగు చేయడం లేదు. 18.29లక్షల టన్నుల కూరగాయల కొరత ఉంది. 60శాతం కూరగాయలను వేరే రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రైతులు సంప్రదాయ పంటలు కాకుండా విభిన్నమైన పంటలు వేసేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి.
– రోహిత్, ఉద్యానశాఖ అధికారి