నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పాలధరను పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. విజయ డెయిరీ పాడి రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు ఒక లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ను కూడా అందిస్తూ వస్తున్నది. ఆరు నెలల క్రితం ఒక లీటర్ పాలపై రూ.4.68పైసలు పెంచి ఇచ్చారు. తాజాగా పాడి రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నామని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ప్రకటించారు.
ఈ నేపథ్యంలో విజయ డెయిరీ ఉన్నతాధికారులు మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా పెంచిన పాల ధర వివరాలతో కూడిన సర్క్యులర్‌ను అన్ని విజయ డెయిరీ కార్యాలయాలకు పంపించారు. మంత్రి వెల్లడించిన ప్రకారం గేదె పాలు అయితే లీటర్‌పైన రూ.2.70 పైసలు పెంచి ఇస్తారు. ఆవు పాలైతే ఒక లీటర్‌కు రూ.5 పెంచి ఇవ్వనున్నారు. పాల ధర పెంచడంతో పాడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
3,500 మంది పాడి రైతులకు లబ్ధి..
జిల్లావ్యాప్తంగా సారంగాపూర్ విజయ డెయిరీలో నమోదైన పాడి రైతులు 6,596 ఉండగా ప్రస్తుతం 3,500 మంది నుంచి పాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాల ధరను పెంచడంతో 3,500 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఒక లీటర్ పాలలో 6శాతం వెన్న ఉన్నట్లు యావరేజ్‌గా తీసుకుంటే ప్రస్తుతం రూ.41.40పైసలు విజయ డెయిరీ రైతులకు చెల్లిస్తున్నది. అయితే తాజాగా గేదె పాలకు లీటరుపైన యావరేజ్‌గా రూ.2.70 పైసలు పెరగడంతో ఇక నుంచి రూ.43.80 పైసలు చెల్లిస్తారు. లీటరు పాలలో వెన్న శాతం 10 ఉంటే ఇప్పటివరకు రూ.69 చెల్లిస్తుండగా తాజాగా పెరిగిన ధరతో రూ.73 చెల్లిస్తారు. ఆవు పాలు ఒక లీటరులో 4 శాతం వెన్న ఉంటే రూ.33.75 పైసలు చెల్లిస్తున్నారు. తాజాగా లీటర్ పైన రూ.5 పెరుగడంతో రూ.38.70 పైసలు చెల్లిస్తారు.
పెరుగనున్న పాల సేకరణ..
ప్రభుత్వం పాల ధర పెంచడంతో విజయ డెయిరీ ద్వారా పాల సేకరణ కూడా పెరుగనున్నది. ధర్పల్లి, వర్ని, బోధన్, కోటగిరి, ఆలూర్, నవీపేట్లో ఉన్న బల్క్ మిల్క్ కూలిం గ్ యూనిట్ల(బీఎంసీయూ) యూనిట్ల నుంచి నిజామాబాద్ డెయిరీకి ప్రస్తుతం 3,200 లీటర్ల పాలు ప్రతిరోజు సేకరిస్తున్నారు. ధర పెరగడంతో పాల సేకరణ మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
పాడి రైతుల ప్రోత్సాహానికే..
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తాజాగా పాల ధరను పెంచింది. పాల ధర పెంపుతో విజయ డెయిరీకి పాల సేకరణ కచ్చితంగా పెరుగుతుంది. జిల్లావ్యాప్తంగా 118 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా 3,200 లీటర్ల పాలను రోజూ సేకరిస్తున్నాం.
– కె.నందకుమారి, డిప్యూటీ డైరెక్టర్ ,నిజామాబాద్