వేల్పూర్, మార్చి 20: ప్రజాస్వామ్యానికి అభివృద్ధే మెట్టు కావాలని, పనికి, ఓటుకు లింక్ పెట్టి చూడాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లోని మం త్రి నివాసంలో ఏర్గట్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులతోపాటు ముదిరాజ్ దుర్గామండలి,యాదవ యూత్, ఎస్సీ యూత్ సభ్యులు సుమారు 100 యువకులు టీఆర్ఎస్లో ఆదివారం చేరా రు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి చేసిన నాయకులను ఆదరించాలన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి చూసి ఏర్గట్ల మండలానికి చెందిన 100 మంది యువకులు టీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు.
ఏర్గట్లను మండల కేంద్రం చేసుకోవడమే కాకుండా రూ.2కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు వేశామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత, కాకముందు ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయంపై చర్చ జరగాలని పిలుపునిచ్చారు. యువత మౌనం గా ఉండకూడదని, మంచి చేసేవారికి అండగా ఉండాలన్నారు. తెలంగాణలో ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇవ్వలేదన్నారు. తెలంగాణ కన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కొందరు మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని, వాట్సాప్‌లో అన్నీ అసత్య ప్రచారాలే చేస్తున్నారని మండిపడ్డారు. యువత అప్రమత్తంగా ఉంటూ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏర్గట్ల ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు పాల్గొన్నారు.