కమ్మర్పల్లి, సెప్టెంబర్ 6: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద ఈ సీజన్లో మంగళవారం నాటికి 316 టీఎంసీల మార్కు దాటింది. సీజన్ ప్రారంభమైన కొద్దిరోజలకే ఇన్‌ఫ్లో మొదలై నేటికీ కొనసాగుతున్నది. జూన్ రెండోవారంలో మొదలైన ఇన్‌ఫ్లో జూలైలో వచ్చిన భారీ వరద ప్రాజెక్టును నింపేసింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో నెలకు సగటున వంద టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చినట్లయ్యింది. ప్రాజెక్టుకు నిరంతర వరద పోటెత్తడంతో జూలై నుంచే మొదలైన ఔట్‌ఫ్లో ఆగస్టు ముగిసే సరికి 235 టీఎంసీలకు చేరింది.ప్రాజెక్టులోకి నిత్యం వస్తున్న వరద..అదే మాదిరి దాదాపుగా నిత్యం ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి, కాలువలకు నీటి విడుదలతో గతేడాది మాదిరిగానే ఈ సీజన్లోనూ ఎస్సారెస్పీ వరదముఖిగా నిలిచింది.
మూడు నెలలుగా వరద ప్రవాహం..
ఈ ఏడాది జూన్ 13తేదీన ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. జూన్‌లో మొత్తం 18 రోజులు వరదలు వచ్చాయి. మొత్తం నెలలో ప్రాజెక్టులోకి 4.698టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. జూలై మాసంలో భారీ ఇన్‌ఫ్లో ప్రాజెక్టును వరద పోటెత్తించాయి. గత నెల 13వ తేదీన ఇన్‌ఫ్లో 100 టీఎంసీల మార్కును, 28న 200 టీఎంసీల మార్కును చేరాయి. సీజన్ ఆరంభం నుంచి జూలై ఆఖరువరకు 210.743 టీఎంసీలుగా నమోదైంది. జూలైలో 206 టీఎంసీల వరద ప్రాజెక్టుకు వచ్చింది. మొత్తం 4లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదతో ఈ మాసంలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరింది. ఆగస్టులోనూ నిరంతర ఇన్‌ఫ్లో కొనసాగింది. ఆగస్టు 29న ఇన్‌ఫ్లో 300 టీఎంసీల మార్కును చేరింది. 30వరకు మొత్తం 301.169 టీఎంసీల ఇన్‌ఫ్లోగా నమోదైంది. ఆగస్టులో మొత్తం 91 టీఎంసీల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. సెప్టెంబర్ 6వ తేదీ వరకు 316.602 టీఎంసీల వరద వచ్చింది.
వృథాగా పోయిన 191టీఎంసీలు
జూలైలో ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో.. నాటి నుంచి ప్రాజెక్టులో తగు నీటిమట్టాన్ని నిర్వహిస్తూ వరద గేట్ల ద్వారా మిగులు జలాలను గోదావరిలోకి వదులుతూ వస్తున్నారు. దీంతోపాటు ప్రా జెక్టు కాలువల ద్వారా అవసరమైప్పుడల్లా మిగులు జలాలు, పంటలకు వదులుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 245.247 టీఎంసీల అవుట్‌ఫ్లో నమోదైంది. జూన్‌లో 1.626 టీఎంసీలు, జూలైలో 153.72 టీఎంసీలు, ఆగస్టులో 79.98 టీఎంసీలు అవుట్‌ఫ్లోగా నమోదయ్యింది. వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 177.370 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 14.217 టీఎంసీలు, మొత్తం 191.587 టీఎంసీల నీటిని విడుదల చేశారు. వరద కాలువ ద్వారా 20.673, కాకతీయ కాలువ ద్వారా 16.028, సరస్వతి కాలువ ద్వారా 0.916, లక్ష్మి కాలువ ద్వారా 0.389, గుత్ప ఎత్తిపోతలకు 0.175, అలీసాగర్ ఎత్తిపోతలకు 0.153, మిషన్ భగీరథకు 1.182 టీఎంసీల నీటిని విడుదల చేయగా 4.210 టీఎంసీలు ఆవిరయ్యాయి. సెప్టెంబర్ 6వ తేదీ వరకు మొత్తం అవుట్ ఫ్లో 245.247 టీఎంసీలుగా నమోదైంది. గతేడాది సీజన్లోనూ భారీ వరదల కారణంగా ప్రాజెక్టులోకి 678 టీఎంసీల వరద రాగా 676 టీఎంసీల అవుట్‌ఫ్లో నమోదైంది. ఈసారి సైతం ఇన్‌ఫ్లో కొనసాగుతుండడం, వానకాలం సీజన్ ఇంకా ఉండడంతో భారీగానే ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో నమోదయ్యే అవకాశం ఉంది.
ఎస్సారెస్పీ వరద గేట్ల మూసివేత
మెండోరా, సెప్టెంబర్ 6: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో వరద గేట్లను మూసివేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 24,370 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 2500, కాకతీయ కాలువకు 5,500, వరదకాలువకు 15 వేలు, లక్ష్మి 200, సరస్వతి 500, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు 215 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ సీజన్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 316.602 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. దీంతో దిగువ గోదావరిలోకి లక్ష్మి, సరస్వతి, వరద, కాకతీయ కాలువలకు 245.247 టీఎంసీల మిగులు జలాలను విడుదల చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉన్నదన్నారు.