నిజామాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఉద్యమ గడ్డ అయిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల వరద కురిపించారు. సోమవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన సీఎం.. ఉభయ జిల్లాల అభివృద్ధికి రూ.180 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతాల మధ్య అంతరాలు రూపుమాపేందుకు పల్లెలు, పట్టణాలను సమానంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించడం, భవిష్యత్తు తరాల కోరికలను తీర్చడంలోనూ ముందుంటున్నారు. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో నిజామాబాద్ జిల్లాకేంద్రం అభివృద్ధి చెందిన తీరే అందుకు నిదర్శనం. ఒకప్పుడు మురికి కూపంగా ఉండే నగరాన్ని ఇప్పుడు మెట్రో సిటీలతో పోటీ పడేలా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ చొరవతో నగర పాలక సంస్థ నలుదిశలా వృద్ధి చెందుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టిపెట్టి ప్రజల కనీస అవసరాలను తీరుస్తున్నది. ఇప్పటికే రూ.300 కోట్ల వ్యయంతో అందంగా ముస్తాబైన నిజామాబాద్ నగరం.. రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందనున్నది. సోమవారం ఇందూరు గడ్డకు వచ్చిన గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి వరాల జల్లు కురిపించడమే ఇందుకు కారణం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రూ.100 కోట్లు, ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 8 నియోజకవర్గాలకు రూ.80కోట్లు మంజూరుతో ఆయా ప్రాంతాలకు మరింత మేలు చేకూరనుంది.
అప్పుడు కామారెడ్డికి..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ను గతేడాది జూన్ 20న ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేసిన పలు అభ్యర్థనలు, విన్నపాలను ఆలకించిన సీఎం కేసీఆర్.. కామారెడ్డి మున్సిపాలిటీ పురోగతి, కొత్త జిల్లా అభివృద్ధికి పుష్కలంగా నిధులు మంజూరు చేశారు. కామారెడ్డి వాసుల చిరకాల కోరికైన అయిన మెడికల్ కాలేజీ మంజూరుతో పాటు ఈ నియోజకవర్గంలోని పలు విద్యుత్ సబ్స్టేషన్లు, పోలీస్ స్టేషన్ ఉన్నతీకరణకూ ఆమోదం తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి బల్దియాలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేశారు. అలాగే, కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున రూ.52.60 కోట్లు ప్రకటించారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోపే ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయి.
ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు..
నూతన సమీకృత అధికార కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా నిజామాబాద్‌కు వచ్చిన సీఎం కేసీఆర్.. మరోమారు ఉమ్మడి జిల్లాపై కరుణ చూపించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అభివృద్ధి కోసం నిధుల వరద కురిపించారు. నిజామాబాద్ నగరానికి ఏకంగా రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెండింగ్ పనుల పూర్తి, నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడం కోసం ఈ నిధులను ప్రత్యేకంగా అర్బన్ నియోజకవర్గానికే కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉభయ జిల్లాల్లో మిగిలిన 8 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రూ.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ధిని ఉద్దేశించి ఈ నిధులు వెచ్చించాలని సీఎం ఆదేశించారు. ఒక్క రోజు పర్యటనలో ఏకంగా ఉమ్మడి జిల్లాకు రూ.10 కోట్లు మంజూరు చేయడంతో ప్రజా ప్రతినిధులంతా సంబురాల్లో మునిగిపోయారు. ఈ నిధులను ప్రజా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వెచ్చించేందుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు.
14 నెలల్లో రూ.332.60 కోట్లు..
ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్య క్రమంలో విడుదలయ్యే నిధులు కాకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి జిల్లాకు భారీగా లబ్ధి చేకూరింది. సరిగ్గా 14 నెలల సమయంలో ముఖ్యమంత్రి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను రెండుసార్లు సందర్శించారు. ఆయా పర్యటనల్లో ఈ ప్రాంతంపై కేసీఆర్ ఉదారతకు రూ.వందల కోట్లు మంజూరు చేయడమే నిదర్శనంగా నిలుస్తోంది. 2021 జూన్ 20న కామారెడ్డి కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి రూ.152.60 కోట్లు మంజూరు చేశారు. తాజాగా సోమవారం నాటి నిజామాబాద్ పర్యటనలో ఏకంగా రూ.180 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దాదాపుగా ఏడాది మీద రెండు నెలల సమయంలోనే రూ.332.60 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రూ.100 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరాన్ని భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ అద్భుతం. కేసీఆర్ దార్శనికతతో నిజామాబాద్ రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే రూ.300 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అందమైన రోడ్లు, తాగునీటి సౌకర్యం, డివైడర్లు, స్ట్రీట్ లైట్లు, సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ట్యాంక్ బండ్.. ఇలా ఒకటేమిటి అనేక మౌలిక సదుపాయాలను కల్పించాం. తాజాగా ప్రకటించిన రూ.వంద కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. రాష్ట్ర సర్కారు ఇస్తున్న నిధులను నగరపాలక సంస్థకు ఆదాయాన్ని తీసుకొచ్చేలా వెచ్చిస్తాం.
– బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే