డిచ్పల్లి, సెప్టెంబర్ 6: చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న తెలంగాణ విశ్వవిద్యాలయం రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. మంగళవారం వర్సిటీలోని క్రీడామైదానంలో నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థి ఉద్యోగం లభించేలా పట్టుదలతో చదవాలని సూచించారు. పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నారు. గ్లోబల్ ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలన్నారు. సాఫ్ట్‌స్కిల్, క్రియేటివ్ స్కిల్స్, మానవ విలువలను కలిగి ఉండాలన్నారు. ప్రపంచం ఒక కుగ్రామం అవుతున్న సందర్భంగా ఉద్యోగాల కోసం ప్రపంచాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలన్నారు. దేశంలో ఎక్కువగా యువకులు ఉన్నారని, విద్యను పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
ఎన్జీవో సంస్థ స్థాపించి ఐఏఎస్‌కు కోచింగ్ ఇస్తున్నానని ఆయన తెలిపారు. విద్యార్థులకు చక్కటి విద్యాబోధన అందిస్తున్న అధ్యాపకులను అభినందించారు. అనంతరం రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బిగాల మహేశ్‌గుప్తా మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు విద్య, ఉద్యోగం, సంపద అనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. లక్ష్యసాధనతో ముందుకెళ్తే ప్రతి విజయం మన వెంటే ఉంటుందన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులందరూ రోడ్డు భద్రతా నిబంధనల విషయాలను తెలుసుకోవాలని తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ‘నీ పా దం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా’ అనే పాటను ఆలపించి అలరించారు. వీసీ రవీందర్‌గుప్తా మాట్లాడుతూ విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
అనంతరం ఓయూ కెమిస్ట్రీ హెడ్ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తెలంగాణ విశ్వవిద్యాలయం అందుబాటులో ఉండి ఉన్నత విద్య ఇక్కడే లభించడం అభినందనీయమన్నారు. విశ్వవిద్యాలయ పురోగతిని రిజిస్ట్రార్ విద్యావర్ధిని చదివి వినిపించారు. ఏడో బెటాలియన్ కమాండెంట్ సత్యశ్రీనివాస్‌రావు, వర్సిటీ పాలకమండలి సభ్యు లు ఆచార్య నసీం, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, టీయూ ప్రజా సంబంధాల అధికారిణి వంగర త్రివేణి, అధ్యాపకులు, రీసర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.