రుద్రూర్, మార్చి17: కలిసిమెలిసి ఉన్న ప్రజలను మత రాజకీయాలతో అనవసరంగా రెచ్చగొట్టొద్దని బీజేపీ నేత మల్యాద్రి రెడ్డికి జడ్పీటీసీ నారోజి గంగారాం, టీఆర్ఎస్ నాయకులు హితవు చెప్పారు. మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మల్యాద్రిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో బీజేపీ కార్యర్తలను ముస్లిములతో కొట్టించారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎలక్షన్లలో చికెన్, డబ్బులు పంచినప్పుడు కులమతాలు గుర్తుకురాలేదని, బీజేపీలో చేరగానే హిందూ ముస్లిములు కనిపిస్తునారా? అంటూ ప్రశ్నించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. మరోసారి తమ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా చేపడుతున్న అభివృద్ధి కనబడడం లేదా? అని ప్రశ్నించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ సాయిలు, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, టీఆర్ఎస్ మండల కార్యదర్శి బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు తోట్ల గంగారాం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, నాయకులు నాగేందర్, ఖాదర్, బాలు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ ముస్లిములను వేరు చేయొద్దు..
రాష్ట్రంలో హిందూ ముస్లిములు కలిసిమెలిసి ఉన్నారని, ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వేరుచేయొద్దని ముస్లిం మైనారిటీ నాయకులు అన్నారు. మల్యాద్రి రెడ్డి ఆరోపణలను వారు ఖండించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు హిందూ ముస్లిములు వేర్వేరు అనేది ఎక్కడా లేదని, ఇప్పుడు మైనారిటీలపై అనవసరంగా ఆరోపించడం బాధాకరమని అన్నారు. గతంలో ముస్లిములతో కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు లేని వివక్ష.. పార్టీ మారగానే ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ముస్లిముల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మేరాజ్, మాజీ అధ్యక్షుడు లాల్ మహ్మద్, సయ్యద్ ముల్తానీ, గ్రామ కన్వీనర్ జమీల్, విండో డైరెక్టర్ సుబానీ, లతీఫ్, ఇమ్రాన్, దస్తగిరి, గౌస్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.