బాన్సువాడ/ఖలీల్‌వాడి, జూలై 30:రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ అవుతున్నది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. వ్యాధికారక క్రీముల అంతానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దోమల నివారణకు కృషి చేస్తున్నది. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు.
మలేరియా
మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ ఎనాఫిలీస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇవి మురుగునీటి కాలువలు, చెరువులు, నీరు నిల్వ ఉన్న కుంటలు, పంట కాలువలు, పొలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇవి రాత్రివేళల్లో ఎక్కువగా కుడతాయి. దోమ కుట్టినప్పుడు కొందరికి నొప్పి, దుద్దుర్లు కలుగవచ్చు. దోమకాటుతో శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్మోడియం పరాన్నజీవి ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తుంది. ఇందులో ప్లాస్మోడియం వైవాక్సు, ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనేవి రెండు రకాలు. ప్లాస్మోడియం వైవాక్స్తో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. కానీ రెండో రకం ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే కాలేయం, కిడ్నీ, రక్తకణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై దాడి చేసి సెరిబ్రల్ మలేరియాకు దారి తీయవచ్చు . కొన్నిమార్లు రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీసి రక్తస్రావానికి కూడా కారణమవుతుంది.
లక్షణాలు : తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం. జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది. 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది.
జాగ్రత్తలు : దోమ తెరలు వినియోగించాలి.
ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ఒకవేళ నీరు నిల్వ ఉంటే అందులో కిరోసిన్ లేదా పురుగు మందును పిచికారీ చేయించాలి.
పైలేరియా ..
ఈ వ్యాధి ఒక క్యూలెక్సు క్యుంక్యుఫాసియాటస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇవి మురుగునీరు , బురుద ఎక్కువగా ఉన్న గుంతలు, సెప్టిక్ ట్యాంకుల్లో వృద్ధి చెందుతాయి. మంచి నీటిలో కూడా పెరుగవచ్చు.
లక్షణాలు
లార్వా దశలోని పైలేరియా కారక వైరస్ మనుషుల రక్తంలోకి ప్రవేశించినప్పటికీ పైకి మాములుగానే కనబడుతారు. వివిధ దశల తర్వాత ఇవి విశ్వరూపం చూపుతాయి. దోమలు కుట్టడం ద్వారా ఈ వైరస్ కారక వాహకాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వైరస్ లింఫ్ నాళాల్లోకి వెళ్లి చనిపోతాయి. దీంతో ఆ నాళం మూసుకుపోయి అక్కడ వాపు(లింఫోడియా ) తలెత్తుతుంది. ఇది కాళ్లకు, చేతులకు వ్యాపిస్తుంది. పురుషుల్లో వృషణాల్లో కూడా కనబడవచ్చు . అరుదుగా ఇతర భాగాల్లో కూడా వస్తుంది. ఎక్కువ మందికి కాళ్లలోనే కనబడి శరీర ఆకృతిని పూర్తిగా దెబ్బతీస్తుంది.
టైఫాయిడ్
వానకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవ కాశం ఉన్నది. ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియాతో వస్తుంది. కలుషిత నీరు తాగడం, ఆహారం తిన డంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
జాగ్రత్తలు :
కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
బయటి ఆహారం తినకూడదు.
రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి.
ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరినీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది.
తేలికపాటి జ్వరం.. జలుబు
సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రీములతో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ వైరల్ ఫీవర్ మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది.
జాగ్రత్తలు :
భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకోవాలి.
నిల్వ పదార్థాలు తినకూడదు.
తాజా పండ్లు తీసుకోవాలి.
వర్షంలో తడవకూడదు.
తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండొద్దు.
మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
మెదడు వాపు
ఇది పందుల నుంచి దోమ ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. పందుల్లో ఈ వైరస్ ఉన్నా వాటికి ఏమీ కాదు. పందులను కుట్టిన దోమలు మనుషులను కుట్టడం ద్వారా మెదడువాపు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, మెదడు పొరల్లో వాపు ఉండడం, శరీరంలో వణుకు, ఏదైనా ఒక భాగం చచ్చుబడి పోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
చికున్ గున్యా
దోమకాటుతో చికున్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు చికున్ గున్యా లక్షణా లు. ఇది సోకితే మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు :
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి.
హెపటైటిస్-ఏ
వానకాలంలో హెపటైటిస్-ఏ(కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి, తాగునీటి నుంచి రోగ కారకక్రీములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ వ్యాధి కారణంగా రక్తంలో బిలిరుబిస్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి.
జాగ్రత్తలు :
శుభ్రమైన ఆహారం తీసుకోవాలి.
కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
బయట ఆహారం తినకూడదు.
వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి.
డెంగీ
వైరల్ జ్వరం మాదిరిగా అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు, చేతులు, ముఖం, వీపు భాగాల చర్మంపై ఎర్రగా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది. ఈడిస్ ఈజిప్టు అనే దోమకాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇండ్లలోని కుండీలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, ఎయిర్ కూలర్లు, పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిన సీసాలు, టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధిచెందుతాయి.
జాగ్రత్తలు :
ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
చెత్తా చెదారం సమీపంలో ఉండకూడదు.
ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి.
దోమ తెరలు వాడడం శ్రేయస్కరం.
వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి. ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్లు, పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి.
తెర వేద్దాం..దోమను తరిమేద్దాం..
వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం దోమలు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. వర్షపు నీరు నిల్వకుండా తగు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక వైద్యబృందాలు గ్రామాలతోపాటు పట్టణాల్లోని కాలనీలను సందర్శిస్తున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్‌బాల్స్ వేసి దోమల వృద్ధిని నివారిస్తున్నారు. పలు గ్రామాల్లో ఫాగింగ్ చేయించి దోమలను నివారిస్తున్నారు. మరోవైపు దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని అవగాహన కల్పిస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతూ లక్షణాలు ఉన్న వారి రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు.
దోమతెరలు వాడాలి..
ప్రతి ఇంట్లో దోమ తెరలను వాడాలి. ఇప్పటికే మండల, గ్రామీణ స్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నది. ఆశవర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ దోమతెరలు వాడకం, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
– డాక్టర్ సుదర్శనం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నిజామాబాద్
అప్రమత్తత తప్పనిసరి..
వానల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్రం జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి.
– డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్, బాన్సువాడ
డెంగీపై ఆందోళనవద్దు..
డెంగీ వ్యాధిపై అవగాహన ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దోమల నివారణపై శ్రద్ధ పెడితే విషజ్వరాల బారినపడకుండా ఉండొచ్చు. డెంగీ వ్యాధితో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది. లక్షా50వేల నుంచి 30వేల వరకు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గినా భయపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా తగ్గితే రోగికి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో మనకు స్థానిక లభ్యమయ్యేవి కావు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ జలగం తిరుపతిరావు, ఎండీ, జనరల్ ఫిజీషియన్ (ప్రభుత్వ వైద్యకళాశాల ప్రొఫెసర్)
ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం..
నిజామాబాద్ జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ప్రబలకుండా అధికారులను అప్రమత్తం చేశాం. గత సంవత్సరం కట్టడి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ అవార్డుని ప్రకటించింది. అదే తరహాలో ఇంటింటి సర్వే నిర్వహించి కేసులు తగ్గుముఖం పట్టేలా చూస్తున్నాం.
-డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా మలేరియా అధికారి, నిజామాబాద్