డిచ్పల్లి, జూలై 30 : తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు ‘అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ’ అనే అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు వీసీ రవీందర్ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అల్ట్రాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో కాన్ఫరెన్స్ కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో శనివారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ వివరాలను వీసీ వివరించారు. అల్ట్రాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రూసా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇన్సా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీయల్, లోకల్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్స్ ఆర్థిక సహకారంతో కాన్ఫరెన్స్‌కు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తదితరులు హాజరవుతారని వివరించారు. దేశ, విదేశాల నుంచి శాస్త్ర, సాంకేతిక రంగాలలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ప్రముఖులు హాజరవుతారని, ఇప్పటికే అమెరికా నుంచి ప్రొఫెసర్ కేవీ రామానుజాచారి, ప్రొఫెసర్ నీల్ మూచా చేరుకున్నారన్నారు. దేశ విదేశాల నుంచి దాదాపు 300 మంది శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కాన్ఫరెన్స్ సావనీర్‌ను ప్రారంభ సమావేశంలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన రోవన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ కందాళం రామానుజాచారి, నీల్ మూచా మాట్లాడుతూ నేటి అత్యాధునిక యుగంలో శాస్త్ర, సాంకేతిక పురోభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు.
ఒకప్పుడు ఏదైనా వ్యాక్సిన్ తయారుచేసేందుకు 32 ఏండ్లు పట్టేదని, ప్రస్తుతం ఎనిమిది నెలల కాలంలోనే తయారవుతున్నదన్నారు. కాన్ఫరెన్స్‌లో నానో, నేచురల్, మెడిసినల్, ఫార్మాస్యూటికల్, మెటీరియల్ సైన్స్ రంగాల్లో విస్తృతమైన అధ్యయనం, ఉన్నతమైన పరిశోధనా, నూతన ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. సమావేశంలో ప్రజాసంబంధాల డైరెక్టర్ డాక్టర్ వంగరి త్రివేణి, ప్రోగ్రాం ఇన్చార్జీలు వాసం చంద్రశేఖర్, సంపత్‌కుమార్, అతీఖ్ సుల్తాన్ఘోరీ తదితరులు పాల్గొన్నారు.