అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ధాన్యం, బియ్యం సేకరణ నుంచి మొదలుకొని అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెడుతూ రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. ఇన్నాళ్లు రైతులను వేధించుకు తిన్న మోదీ సర్కారు.. ఇప్పుడు పేదలపై పడింది. వారి ‘ఉపాధి’ని దెబ్బ తీసే కుట్రలకు తెర లేపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల సంఖ్యను కుదిస్తున్నది. కొత్త కొత్త నిబంధనలతో పేదలకు వంద రోజుల పనిని దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. చట్టరూపంలో ఉన్న ‘ఉపాధి హామీ’ని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఆలంబనగా ఉన్న పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర సర్కారు చేస్తున్న కుటిల యత్నాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉపాధి పనుల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర దుమారమే రేగుతున్నది.
నిజామాబాద్, జూలై 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వమంటే రాజ్యాంగానికి తొలి సంరక్షకులుగా ఉండాలి. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలకు విలువనిస్తూ ప్రజలకు మేలు తలపెట్టాలి. కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న పార్టీకి భిన్నమైన ప్రభుత్వాలు ఆయా రాష్ర్టాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పాలి. త్వరలోనే 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు యావత్ దేశానికి తలవంపులు తీసుకువస్తున్నది.
రోజుకో విధంగా చట్టాలకు, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపును మరింత తీవ్రంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిలుపుదల చేసే విధంగా చర్యలకు పూనుకోవడం తీవ్ర దుమారం రేపుతున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆలంబనగా ఉన్న పథకాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న కుటిల యత్నాలను ప్రజలు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ ఫక్తు రాజకీయ కుయుక్తులకు పాల్పడుతుండడం సిగ్గుచేటని చెబుతున్నారు.
నరేగా ఓ సామాజిక భద్రత…
దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు గత ప్రభుత్వాలు చట్ట రూపంలో తీసుకు వచ్చిన స్కీమ్ జాతీయ ఉపాధి హామీ పథకం. 2005లో చట్టంగా రూ పాంతరమైన ఈ పథకాన్ని కేంద్ర కార్మిక మం త్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా రూపకల్పన చేశాయి. రైట్ టు వర్క్ నినాదంతో 23 ఆగస్టు, 2005న పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొం దింది. 2009లో జాతిపిత మహాత్మాగాంధీ పేరును ఈ పథకానికి చేర్చారు. అప్పటి నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పిలుస్తున్నారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి 100 రోజులు పని దినాలు కల్పించి వేతనాలు అందించడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఈ చట్టాన్ని తొలిసారిగా 1991లో తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నర్సింహారావు ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా తొలి రోజుల్లో కొద్ది ప్రాంతాల్లో అమలైనప్పటికీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఈ చట్టానికి ముప్పు లేకుండా రక్షణ కల్పించినప్పటికీ ఘనత వహించిన బీజేపీ ప్రభుత్వం తమకేమీ అడ్డూ అదుపు లేదని విర్ర వీగుతూ పేదల కడుపు కొడుతుండడం విడ్డూరంగా మారింది. తెలివిగా పనుల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా పరోక్షంగా ఉపాధి కల్పన దినాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నది.
సంక్షోభంలో అండగా…
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గొప్పతనం మోదీ హయాంలోనే ప్రస్ఫుటంగా కనిపించింది. 2020 ప్రారంభంలో దేశాన్ని కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. మోదీ అనాలోచిత నిర్ణయం ద్వారా అమలైన లాక్డౌన్ మూలంగా దేశ వ్యాప్తంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, పేద కుటుంబాలు అధోగతికి గురయ్యాయి. ఉపాధి కోసం సుదూరాలకు వెళ్లిన వారంతా తిరిగి గ్రామాలకు చేరాల్సి వచ్చింది. ఈ సమయంలో పని లేక కొట్టుమిట్టాడిన బతుకులకు ఉపాధి హామీ పథకమే ఆసరాగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.
18 ఏండ్లు దాటిన యువత మొదలుకుని వృద్ధుల వరకు ఉపాధి హామీలో పాలుపంచుకుని డబ్బులు సంపాదించుకున్నారు. లాక్‌డౌన్‌తో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కోట్లాది మంది ఆకలితో అలమటిస్తే మోదీ సర్కారు మాత్రం కనీసం పట్టించుకోలేదు. ఈ సమయంలో నరేగా పథకం ద్వారా వచ్చిన వేతనాలతో కుటుంబాలు కాసింత ఊరట పొందాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా సమయంలో అత్యధిక మందికి జాబ్ కార్డులు సైతం మంజూరు చేశారు. కామారెడ్డిలో 42వేల మందికి, నిజామాబాద్‌లో 36వేల మందికి పైగా జాబ్ కార్డులిచ్చి ఉపాధి కల్పించారు. ఇదంతా గ్రహించని మోదీ సర్కారు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కూలీలకు ఉపాధి… కుటుంబాలకు భరోసా…
నరేగా స్కీమ్ గొప్పతనాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం ముందుకు ఓ ప్రతిపాదనను తీసుకు వచ్చింది. విజయవంతంగా జరుగుతున్న ఉపాధి హామీని వ్యవసాయ పనులకు అనుసంధానించాలని సీఎం కేసీఆర్ స్వయంగా కోరారు. సాగు సమయంలో కూలీల కొరతను నివారించడం, రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గించేందుకు సూచించిన విప్లవాత్మకమైన సలహాను మోదీ సర్కారు పక్కన పెట్టింది.
కూలీలకు ఉపాధి ధైర్యం కల్పించడంతో పాటు కుటుంబాలకు భరోసానిచ్చే చర్యకు కేంద్ర సర్కారు వెనుకడుగు వేయగా… కొర్రీల మీద కొర్రీలు పెట్టి ఉన్న పథకాన్ని ఊడగొట్టే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుండడం అమానవీయ చర్యగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 76వేల 340 జాబ్ కార్డులకు 5లక్షల 62వేల 199 మంది కూలీలు నమోదు కాగా ఇందులో నిత్యం పనికి వచ్చే వారు 3లక్షల ఒక వేయి 418 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో జాబ్ కార్డులు ఉన్న కుటుంబాల సంఖ్య 2లక్షల 58వేల 910 కాగా కూలీలు 5లక్షల 38వేల 919 మంది ఉన్నారు. నిత్యం పనికి వచ్చే వారి సంఖ్య సుమారు 2లక్షల మంది ఉండడం విశేషం.
అందని ద్రాక్షగా మారనున్న కూలీల అలవెన్స్‌లు
కూలీలకు ఏకైక ఉపాధిగా ఉన్న ఉపాధిహామీ పథకాన్ని కొల్లగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల అమలుకు పూనుకున్నది. దీంతో కూలీలకు ఉపాధి పనులు తగ్గిపోతాయి. అంతేగాకుండా పని చేయడానికి అవసరమైన పనిముట్లు, తాగునీటి సరఫరా, ఛార్జీలు, సమ్మర్ అలవెన్స్‌లు అన్నీ అందకుండా పోతాయి. కూలీలకు నష్టం కలిగించే ఈ చర్యను కేంద్రం ఉపసంహరించుకోవాలి.
-లక్ష్మణ్‌రావు, సర్పంచ్, గుండారం
ఉపాధిహామీ కూలీలకు అలవెన్స్‌లు ఉండాలి
గతంలో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన ప్రకారం అలవెన్స్‌లు అమలు చేయాలి. కొత్తగా సాప్ట్వేర్ తీసుకురావడంతో పోస్టాఫీస్ ఖాతాలకు లింక్ రాకపోవడంతో కూ లీలను మళ్లీ కొత్త ఖాతాలు తీయమనడం సరికాదు. రవాణా, టెంట్, గడ్డపార, పా రా, తాగునీటికి వచ్చే భత్యాలను కేంద్ర ప్రభుత్వం అందించాలి
-స్రవంతి, సర్పంచ్, శేరీ బీబీపేట
హరితహారం పనులు సాగడం లేదు
కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా గ్రామాల్లో హరితహారం పనులు ముందుకు సాగడం లేదు. ఉపాధి హామీ పథకం పనులకు కూలీలు రావడం లేదు. హరిత తెలంగాణగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. నూతన విధానంతో కూలీలకు సక్రమంగా డబ్బులు సైతం అందకుండా పోతున్నాయి.
-పుట్టి పోశయ్య,సర్పంచ్, సజ్జన్పల్లి
పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
మెండోరా : ఉపాధిహామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కు ట్ర పన్నుతున్నది. ఉపాధిహామీ కూలీలు పని చేస్తున్నప్పుడు వారికి బిల్లులు చెల్లించి న అనంతరం 40 శాతం మెటీరియల్ కాం పోనెంట్ నిధులు గతంలో మంజూరయ్యే వి. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశముండేది. కానీ కేంద్రం అనుసరిస్తున్న కొత్త నిబంధనలు ఉపాధిహామీ పథకాన్ని కుంటుపడే విధంగా చేస్తున్నది.
– సామ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, మెండోరా