ఒకప్పుడు బానిసవాడగా ఉన్న గ్రామం.. నేడు అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచింది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడ.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మున్సిపాలిటీగా మారినప్పటినుంచి అన్ని హంగులతో ప్రగతిబాట పట్టింది. సమైక్య పాలనలో నిధులు రాక అస్తవ్యస్తంగా కనిపించిన పట్టణం నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో శభాష్ అనిపించుకొని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సైతం అందుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో బాన్సువాడ పట్టణం స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రంలో నేడు అగ్రగామిగా నిలిచింది.
-బాన్సువాడ, జూలై 28
గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్‌గా..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అనేక కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడను 2018, జనవరిలో మున్సిపాలిటీగా ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో 40 వేల జనాభా ఉండగా, 16 కిలోమీటర్ల మేర పట్టణం విస్తరించింది.
నెరవేరిన పేదల సొంతింటి కల..
నీడ లేని అనేక కుటుంబాలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో సొంతింటి కల నెరవేరింది. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారులో వెయ్యి ఇండ్లను నిర్మించారు. గుడిసెలు, రేకుల షెడ్లల్లో కిరాయికి ఉండే నిరుపేదలకు 500 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. మరో 500 ఇండ్లు పూర్తికాగా, త్వరలోనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. బీడీవర్కర్స్ కాలనీలో 200 కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారు. వీటితోపాటు వివిధ కాలనీల్లో సొంత స్థలాలు ఉన్నవారికి రెండు వేల ఇండ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేశారు.
పుష్కలంగా నిధులు.. వేగంగా అభివృద్ధి
పట్టణాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. రూ. 25 కోట్ల ప్రత్యేక నిధులతో 19 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలతోపాటు అధునాతన పద్ధతుల్లో ప్రధాన రోడ్డును నిర్మించారు. అదనంగా రూ. 25 కోట్ల టీయూఎప్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మించారు. రూ. 20 కోట్లతో వంద పడకల మాతాశిశు దవాఖానను అందుబాటులోకి తెచ్చారు. రూ. 2 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం నిర్మించారు. రూ. 6.7 కోట్లతో కల్కీ చెరువుపై మినీ ట్యాంకు బండ్‌ను నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. రూ. 2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. మున్సిపాలిటీ భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరయ్యాయి.
ఎడ్యుకేషన్ హబ్‌గా..
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో బాన్సువాడ పట్టణం ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. పేద విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతున్నది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు మొదలుకొని డిగ్రీ, పీజీ వరకు కళాశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన బీఎస్పీ నర్సింగ్ కళాశాలను సైతం గతేడాది ప్రారంభించారు. ఇందుకోసం రూ. 40 కోట్లతో కళాశాల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలో రూ. రెండు కోట్లతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బాలికల, ఉర్దూ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం ఎస్ఆర్ఎన్కే డిగ్రీ, పీజీ కళాశాలను ఏర్పాటు చేశారు.
మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు..
బాన్సువాడను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు స్పీకర్ పోచారం సూచనల మేరకు మున్సిపల్ కార్యవర్గ సభ్యులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కొయ్యగుట్ట వద్ద జంక్షన్, బాన్సువాడ స్వాగత కమాన్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. నర్సింగ్ రావు కాంటా నుంచి సంగమేశ్వర కాలనీవరకు ఎల్లయ్య చెరువు మీదుగా బీటీ రోడ్డు వేయనున్నారు. తాడ్కోల్ చౌరస్తా నుంచి ఫిల్టర్ బెడ్ వరకు డబుల్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రజలు సేదతీరేందుకు కల్కి చెరువు సమీపంలో రూ. 4 కోట్లతో పార్కును ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో పాలకవర్గం కృషిని అభినందిస్తూ మున్సిపాలిటీకి 2020-21లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేటివ్ ప్రోగ్రాం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కింది.
రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు..
రాష్ట్రంలోనే బాన్సువాడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పేదలు, రైతులకు స్పీకర్ పోచారం ఎప్పు డూ అండగా ఉంటారు. ఎక్కడా లేనివిధంగా బాన్సువాడలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందజేశాం. ప్రజల అవసరాల మేరకు అన్ని హంగులతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.
-షేక్ జుబేర్, మున్సిపల్ వైస్ చైర్మన్, బాన్సువాడ
సుందరంగా తీర్చిదిద్దుతున్నాం..
పట్టణ అభివృద్ధి, సౌకర్యాలు కల్పించడంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. అలాంటి ప్రజా నాయకుడి హయాంలో మున్సిపాల్ చైర్మన్‌గా పనిచేయడం నా అదృష్టం. స్పీకర్ సహకారం, సూచనలతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. భారీగా నిధులు మంజూరు కావడంతో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
-జంగం గంగాధర్, మున్సిపల్ చైర్మన్, బాన్సువాడ